సీఎం కేసీఆర్‌ దళితుల బాంధవుడు: గంగుల కమలాకర్‌

20 Jul, 2021 07:49 IST|Sakshi
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న మంత్రి కమలాకర్, నాయకులు

సాక్షి, కరీంనగర్‌: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కలలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, దళిత బంధు పథకం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌ దళితుల బాంధవుడని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. సోమవారం కరీంనగర్‌ కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. గత పాలకులు దళితులను ఓట్లు వేసే యంత్రాలుగా వాడుకున్నారని, అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు.

రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన దళితులకు పెద్దపీట వేసేందుకే సీఎం కేసీఆర్‌ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. దాన్ని హుజూరాబాద్‌ నుంచి ప్రారంభించడం శుభపరిణామమన్నారు. అర్హులైన దళిత కుటుంబాలకు ఎవరి ప్రమేయం లేకుండా రూ.10 లక్షలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ.. స్వయం పాలనలో ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు దళితులకు సముచిత స్థానం కల్పిస్తున్న సీఎంకు దళితులంతా రుణపడి ఉంటారన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, దళిత సంఘాల నాయకులు కంసాల శ్రీనివాస్, మేడి మహేష్, అర్ష మల్లేశం, కామారపు శ్యాం, బోయిన్‌పల్లి శ్రీనివాస్, తిరుపతినాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

ప్రపంచంలోనే గొప్ప పథకం 
హుజూరాబాద్‌: దళితులను ఉన్నత స్థితికి తీసుకురావడమే లక్ష్యంగా  ప్రపంచంలోనే గొప్ప పథకం దళిత బంధును సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరపరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. హుజూరాబాద్‌లోని స్థానిక అంబేద్కర్‌ విగ్రహనికి పూలమాలలు వేశారు. అనంతరం హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌తో కలిసి  సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు గడుస్తున్నా నాయకులు, పార్టీలు, ప్రభుత్వాలు మారినా దళితుల జీవితాల్లో మార్పు రావడం లేదన్నారు.

పార్టీలకతీతంగా దళిత బంధు పథకం అమలవుతుందని, హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని  అర్హుల ఖాతాలల్ల రూ.10 లక్షలను ప్రభుత్వం జమ చేస్తుందని పేర్కొన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఈటల రాజేందర్‌ కోరుకున్నదే అని, ఆయన దేనికోసం పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక, వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల,టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు తదితరులు  పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు