ధాన్యం కొనుగోళ్లు 69.5 లక్షల మెట్రిక్‌ టన్నులు 

22 Jan, 2022 02:25 IST|Sakshi
మంత్రి గంగుల 

సాక్షి, హైదరాబాద్‌: వానాకాలం సీజన్‌లో ధాన్యం సేకరణ దాదాపుగా పూర్తి కావచ్చిం దని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ఇప్పటివరకు 69.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, మరో 2 లక్షల టన్నుల వరకు సేకరించే అవకాశం ఉందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోళ్లలో పెట్టిన పేచీలను అధిగమించి విజయవంతంగా ధాన్యం సేకరణ జరిపినట్లు తెలిపారు. రాష్ట్రంలో వానాకాలం సీజన్‌లో ఇంత పెద్ద మొత్తంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం ఇదే తొలిసారని వివరించారు.  

12.72 లక్షల మంది నుంచి కొనుగోలు 
‘గత సంవత్సరం వానాకాలంలో 48 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించగా.. ఈసారి అదనంగా మరో 22 ఎల్‌ఎంటీ ధాన్యాన్ని రైతుల నుంచి తీసుకోవడం జరిగింది. ఈ సీజన్‌లో 6,878 కొనుగోలు కేంద్రాలను తెరవగా, దాదాపు 20 జిల్లాల్లో ధాన్యం సేకరణ పూర్తిస్థాయిలో జరిగింది. వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాల్లో కొన్నిచోట్ల ఆలస్యంగా సాగు చేసిన కారణంగా కొనుగోళ్లలో జాప్యం జరిగింది. 12.72 లక్షల మంది రైతుల నుంచి రూ.13,601 కోట్ల విలువైన ధాన్యాన్ని ఇప్పటివరకు కొనుగోలు చేశాం.

ఆన్‌లైన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (ఓపీఎంఎస్‌)లో నమోదైన 8.68 లక్షల మంది రైతులకు రూ.11 వేల కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. మరో రూ. 2,500 కోట్లు ఓపీఎంఎస్‌లోకి వివరాలు ఎక్కగానే రైతుల ఖాతాల్లోకి చేరతాయి. రైతులకు ధాన్యం సొమ్మును ఒక్కరోజు కూడా ఆపకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వచ్చే యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండబోవని ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో రైతులు అందుకు అనుగుణంగానే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించడం హర్షణీయం..’ అని మంత్రి గంగుల పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు