వ‌ర్ష‌సూచ‌న‌..ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

21 Sep, 2020 15:59 IST|Sakshi

సాక్షి, క‌రీంన‌గ‌ర్ :  మరో రెండు రోజులపాటు భారీ వర్ష సూచన ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర బిసి సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. వర్షం, వరదలతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. కరీంనగర్‌లో రాత్రి కురిసిన భారీ వ‌ర్షానికి  జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ పర్యటించారు. రేకుర్తిలో పలు ఇళ్లలోకి నీళ్లు రావడాన్ని మంత్రి పరిశీలించారు. నగర శివారులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో ఓపెన్ ప్లాట్లలో నీళ్లు నిలిచి పలు ఇళ్లలోకి నీళ్లు చేరాయన్నారు. నిలిచి ఉన్న నీళ్లను వెంటనే తొలగించే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు జిల్లా కేంద్రంలో ఉండి వర్షం, వరదల పరిస్థితిని సమీక్షిస్తున్నామని ఎక్కడ ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎలాంటి విపత్కర పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగంతో పాటు టిఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని గంగుల పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో వర్షాకాలం ఆరంభంతోనే జిల్లాలోని జలాశయాలన్ని జలకళను సంతరించుకున్నాయని, ఏ చిన్న వర్షం పడ్డా జలాశయాలు ఓవర్ ప్లో  అయ్యే పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉందన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి ఉండటంతో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండి, మంచి నీటిని కాచి చల్లార్చి తాగాలని మంత్రి సూచించారు. (ఫ్లై ఓవర్‌పై ఘోరం: సీసీ కెమెరాల్లో దృశ్యాలు)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా