శ్రీగిరిపల్లి పిల్లలకు చేయూత

20 Jul, 2021 03:00 IST|Sakshi
పిల్లలకు చెక్కులను పంపిణీ చేస్తున్న వంటేరు ప్రతాప్‌రెడ్డి, ముత్యంరెడ్డి

తల్లిదండ్రులను కోల్పోయిన ఐదుగురు పిల్లలు

పిల్లల దైన్యస్థితిని మంత్రి హరీశ్‌కు వివరించిన ‘సాక్షి’

మంత్రి ఆదేశంతో రూ. 2.5 లక్షల సాయం

గజ్వేల్‌: సాక్షి’ప్రయత్నం ఫలించింది. తల్లిదండ్రుల మృతితో అనాథలైన పిల్లలకు ప్రభుత్వ ఆసరా లభించింది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు దృష్టికి ఈ పిల్లల దైన్యస్థితిని తీసుకెళ్లడంతో చలించిన ఆయన, వారిని ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు సోమవారం ఐదుగురు పిల్లలకు మొత్తం రూ.2.5 లక్షల చెక్కులను అందజేశారు. వివరాలిలా ఉన్నాయి.

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం శ్రీగిరిపల్లి గ్రామంలో చిన్ననర్సని యాదయ్య, లక్ష్మి దంపతుల మృతితో వారి కుమారుడు సతీశ్‌తో పాటు నలుగురు కూతుళ్లు అనూష, అశ్విని, మేనక, స్పందనలు అనాథలైన విషయాన్ని జూన్‌ 7న ‘సాక్షి’మెయిన్‌ సంచిక వెలుగులోకి తెచ్చింది. ఏడాది క్రితం అనారోగ్యంతో తండ్రి చనిపోగా.. తల్లి కరోనా కారణంగా జూన్‌ 6న మృత్యువాత పడడంతో ఈ పిల్లలంతా అనాథలైన సంగతి తెలిసిందే.

ఎలాంటి ఆస్తిపాస్తులు లేని ఈ కుటుంబానికి రెక్కల కష్టమే జీవనాధారం. ఇలాంటి తరుణంలో పిల్లల చదువులు ప్రశ్నార్థకంగా మారాయి. కుటుంబ పరిస్థితుల కారణంగా సతీశ్‌ కొద్ది రోజుల నుంచి బైక్‌ మెకానిక్‌ పని నేర్చుకుంటున్నాడు. అనూష టెన్త్‌ పూర్తి చేసింది. ఆశ్విని 10వ తరగతి, స్పందన ఏడో తరగతి, మేనక అయిదో తరగతి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. ఈ విషయాన్ని ‘సాక్షి’మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకువెళ్లింది.

వెంటనే స్పందించిన ఆయన పిల్లల పరిస్థితిపై విచారణ చేపట్టి నివేదిక అందించాలని గజ్వేల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డికి ఆదేశాలిచ్చారు. విచారణ అనంతరం ముత్యంరెడ్డి కొన్ని రోజుల క్రితం నివేదికను అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డిని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.

ఈ మేరకు పిల్లలకు ఒక్కొక్కరి పేరిట రూ.50 వేల చొప్పున మొత్తంగా రూ. 2.5 లక్షల సాయాన్ని కలెక్టర్‌ ప్రకటించారు. సోమవారం రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాపరెడ్డి, ‘గడా’ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి బాధిత పిల్లలకు చెక్కులను అందజేశారు.

మరిన్ని వార్తలు