కేసీఆర్‌ లేకుంటే తెలంగాణ లేదు

18 Feb, 2022 01:53 IST|Sakshi
సీఎం కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం సిద్దిపేటలోని మినీ స్టేడియంలో మంత్రి హరీశ్‌ ‘కేసీఆర్‌ క్రికెట్‌ ట్రోఫీ’ని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సినీ హీరో అఖిల్‌తో కలిసి  ప్రారంభించారు. అఖిల్,  హరీశ్‌రావు క్రికెట్‌ ఆడి అలరించారు 

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపారు

మంత్రి హరీశ్‌రావు

రంగనాయక సాగర్‌ ఎడమ కాల్వ ద్వారా గోదావరి జలాలు విడుదల

సాక్షి, సిద్దిపేట: ‘సీఎం కేసీఆర్‌ లేకపోతే తెలంగాణ లేదు.. తెలంగాణ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ లేదు.. రంగనాయక సాగర్‌ జలాశయం ఉండేది కాదు.. సిద్దిపేట ప్రాంతానికి సాగు జలాలు సైతం వచ్చేవి కావు..’ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం సీఎం కేసీఆర్‌ జన్మదినోత్సవం సందర్భంగా రంగనాయక సాగర్‌ ఎడమ కాల్వ ద్వారా గోదావరి జలాలను ఆయన విడుదల చేశారు. అనంతరం రంగనాయక సాగర్‌ కట్టపై కేక్‌ కట్‌ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని హరీశ్‌ ఆకాంక్షించారు. గుక్కెడు నీళ్ల కోసం తపించిన రాష్ట్రాన్ని సమృద్ధిగా సాగు జలాలతో ఆకుపచ్చ తెలంగాణ, సస్యశ్యామల తెలంగాణ అయ్యేలా చేసిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన సహకారం రాకున్నా అత్యుత్తమ ఆర్థిక విధానాలతో తెలంగాణను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపారని కొనియాడారు. ఏడేళ్లలో తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా, దిక్సూచిగా నిలిపారన్నారు.

అత్యుత్తమ ఆర్థిక విధానాలతో రాష్ట్ర జీఎస్‌డీపీని రెట్టింపు చేశారని తెలిపారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణను నంబర్‌ వన్‌గా నిలిపారన్నారు. అనంతరం మంత్రి సిద్దిపేట పట్టణంలోని క్యాంప్‌ ఆఫీస్‌లో కేసీఆర్‌ జన్మ రాశి సూచిక ప్రకారం మోదుగ మొక్కను నాటారు. కార్యక్రమంలో ఈఎన్‌సీ హరే రామ్, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ రోజా శర్మలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు