2,641 కోట్లు ఇవ్వండి

23 Sep, 2020 04:14 IST|Sakshi

ఐజీఎస్టీ బకాయిలు చెల్లించాలని కేంద్రాన్ని కోరిన మంత్రి హరీశ్‌

జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలోపే రాష్ట్రానికి ఇవ్వాలని విజ్ఞప్తి

గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐజీఎస్టీపై చర్చ  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు రావాల్సిన ఐజీఎస్టీ బకాయిలు రూ.2,641 కోట్లను వెంటనే ఇవ్వాలని కేంద్ర ప్రభు త్వాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. కరోనా మిగిల్చిన ఆర్థిక కష్టాలను పూడ్చుకునేందుకు ఈ నిధులు ఎంతో అవసరమని, వచ్చే నెల 5న జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశానికి ముందే ఈ మొత్తాన్ని రాష్ట్రాలకు చెల్లించాలని, ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు చేయాలన్నారు. మంగళవారం బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీ అధ్యక్షతన జరిగిన ఐజీఎస్టీ గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ సమావేశానికి బీఆర్‌కేఆర్‌ భవన్‌ నుంచి మంత్రి హరీశ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు.

ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన ఐజీఎస్టీ మొత్తం రూ.2,641 కోట్లు కాగా, జీఎస్టీ కౌన్సిల్‌ మాత్రం రూ.3 కోట్లు తగ్గించి చెబుతోందని, ఈ లెక్కలపై ఎలాంటి సమస్య లేదని, అయితే ఈ మొత్తాన్ని వారం రోజుల్లోగా రాష్ట్రాలకు చెల్లించాలని గ్రూఫ్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ తరఫున సిఫార్సు చేయాలని మోదీని కోరారు. వచ్చే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోకపోతే మరో 3 నెలలు ఆగాల్సి వస్తుందని చెప్పారు. హరీశ్‌ ప్రతిపాదనపై స్పందించిన సుశీల్‌ మోదీ అక్టోబర్‌ 1న మరో మారు ఐజీఎస్టీ గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. తెలం గాణతో పాటు మరో 16 రాష్ట్రాలకు 2018 నుంచి ఐజీఎస్టీ బకాయిలు ఉన్నాయని, 8 రాష్ట్రాల నుంచి రావాల్సిన నిధులను కన్సాలిడేట్‌ ఫండ్‌ నుంచి చెల్లింపులు చేసే సమయంలో సర్దుబాటు చేయాలని హరీశ్‌ పేర్కొన్నారు. సమావేశంలో మంత్రి హరీశ్‌తో పాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ నీతూ కుమారి ప్రసాద్, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు