మీటర్లు పెట్టలేదని రూ.30 వేల కోట్లు ఆపింది 

23 Sep, 2022 04:17 IST|Sakshi

మెదక్‌జోన్‌: వ్యవసా య బోరు బావులకు మీటర్లు పెట్టలేదని రాష్ట్రానికి రావాల్సిన రూ.30 వేల కోట్లను కేంద్రం నిలిపివేసిందని మంత్రి హరీశ్‌రావు బీజేపీపై ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు ప్రజల దృష్టి కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. మెదక్‌ కలెక్టరేట్‌లో గురువారం జరిగిన జెడ్పీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.

రైతు ప్రయోజనాలే ముఖ్యమని భావించి సీఎం కేసీఆర్‌ రూ.30 వేల కోట్లు పోయినా సరే వ్యవ సాయ బావులకు మీటర్లు పెట్టలేదన్నారు. కేంద్రం విద్యుత్‌ శాఖను కూడా ప్రైవేట్‌ పరం చేసిందని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. రాష్ట్రాలు లక్షల కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేసుకున్న విద్యుత్‌ శాఖను కేంద్రం ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే విధంగా దొడ్డిదారిన నోటిఫికేషన్‌ జారీ చేసిందని మండిపడ్డారు. 

మరిన్ని వార్తలు