‘బీజేపీ నేతలు అడ్డంపొడుగు మాట్లాడుతూ నవ్వుల పాలవుతున్నారు’

20 Mar, 2022 01:57 IST|Sakshi
గోదావరి జలాల విడుదల అనంతరం పూలు చల్లుతున్న మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి తదితరులు  

విపక్షాలపై మంత్రి హరీశ్‌ ధ్వజం 

పచ్చని పంటపొలాలను చూడలేకపోతున్నారు 

కాంగ్రెస్‌ నిర్వాకాలు ప్రజలకు తెలుసు 

బీజేపీ చేసిన ఒక్క మంచి పనేంటో చెప్పాలి 

కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలు విడుదల చేసిన మంత్రి 

గజ్వేల్‌: కాళేశ్వరం ద్వారా కొత్తగా ఒక ఎకరాకైనా నీరు పారిందా? అని కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు చేయడం సిగ్గుచేటని, కళ్లముందు పచ్చటి పంటపొలాలు కనిపిస్తున్నా...కళ్లుండీ చూడలేని కబోదుల్లా మాట్లాడుతున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం కొడకండ్లలోని కొండపోచమ్మసాగర్‌ కాల్వ ద్వారా కూడవెల్లి వాగు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని గండిచెరువుకు గోదావరి జలాలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పాలనలో తాగునీటికి కూడా కటకట ఉండేదన్నారు. ఇప్పడు సీఎం కేసీఆర్‌ సమృద్ధిగా తాగు, సాగు నీరు ఇస్తుంటే విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. మండుటెండల్లోనూ వాగులను పారిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. నీళ్లు రావడం ఇష్టం లేక.. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనుల్లో అవినీతి జరిగిందని కొత్త పల్లవి అందుకున్నారని మండిపడ్డారు.

బీజేపీ నేతలు సైతం అడ్డంపొడుగు మాట్లాడుతూ ప్రజల్లో నవ్వుల పాలవుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత కరెంట్, పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లాంటి పథకాలున్నాయా..? అంటూ ప్రశ్నించారు. రైతులకు సాగునీటితోపాటు ఎరువులు, కరెంట్‌ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బీజేపీ ప్రజలకు చేసిన ఒక్క మంచి పనేమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఎరువుల బస్తాలకోసం చెప్పుల లైన్లు...
కాంగ్రెస్‌ పాలనలో ఎరువుల బస్తాల కోసం చెప్పులతో లైన్‌ కట్టాల్సిన పరిస్థితులను ప్రజలు మరచిపోతారా? అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. నేడు రిజర్వాయర్లకు దేవుళ్ల పేరు పెట్టుకుంటే కూడా తట్టుకోలేకపోతున్నారన్నారు. రైతులు ఆయిల్‌పామ్‌ సాగువైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం 30 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగుకు సహకారాన్ని అందించడానికి ప్రభుత్వం వద్ద ప్రణాళిక సిద్ధంగా ఉన్నదన్నారు.

ఈ కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీలు డాక్టర్‌ యాదవరెడ్డి, రఘోత్తంరెడ్డి, జెడ్పీచైర్‌పర్సన్‌ రోజాశర్మ, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ హరిరామ్, అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మాదాసు అన్నపూర్ణ పాల్గొన్నారు.

హుటాహుటిన ఫామ్‌హౌస్‌కు 
ఇదిలా ఉండగా మంత్రి హరీశ్‌రావు కొడకండ్ల కార్యక్రమంలో పాల్గొనే ముందే ఫామ్‌హౌస్‌లో నిర్వహించనున్న అత్యవసరభేటీకి హాజరుకావాలని సీఎం నుంచి పిలుపురావడంతో ఇక్కడ త్వరగా ముగించుకొని ఆయన హుటాహుటిన వెళ్లిపోయారు. వర్గల్‌లో హల్దీవాగులోకి నీటి విడుదల, సిద్దిపేటలో నిర్వహించాలనుకున్న కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు