దమ్ముంటే కేసీఆర్,హరీశ్‌రావు నాపై పోటీచేయాలి:ఈటల

9 Aug, 2021 02:21 IST|Sakshi
మాట్లాడుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌

ఉరుములు వచ్చినా.. పిడుగులు పడినా నా గెలుపును ఆపలేరు

హుజూరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో దమ్ముంటే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు తనపై పోటీచేయాలని మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ సవాల్‌ విసిరారు. ఉరుములు వచ్చినా.. పిడుగులు పడినా తన గెలుపును ఎవరూ ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం చెల్పూర్‌లో బీజేపీలో చేరిన దాదాపు 500 మంది ముదిరాజ్‌ కులస్తులకు ఈటల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ, ‘నన్ను బక్కపల్చటి పిలగాడు.. దిక్కులేని వాడని అనుకోవద్దు.. హుజూరాబాద్‌ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న బిడ్డను నేను’ అన్నారు.

దళితబంధుతో రూ.10 లక్షలు ఇచ్చినా.. గొర్రెలిచ్చినా, కులాల వారీగా తాయిలాలిచ్చినా ప్రజల గుండెల్లో ఉంది తానేనని పేర్కొన్నారు. తాను పనిచేస్తేనే ఇక్కడి ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, జెడ్పీటీసీలుగా గెలిచారన్నారు. సీఎం కేసీఆర్‌కు దళితుల ఓట్ల మీద తప్ప, హుజూరాబాద్‌ దళితులపై ప్రేమ లేదని, ఆసరా పింఛన్లు, రేషన్‌కార్డులు ఇవ్వాలని కోరినందుకే తనపై కేసీఆర్‌ కోపం పెంచుకున్నారని తెలిపారు. కమ్యూనిటీ హాళ్లకు, ఆలయాలకు నిధులిస్తే తప్పులేదని, ఆ సొమ్మంతా ప్రజలదే అన్నారు. ఏమిచ్చినా తీసుకుని ఓటు మాత్రం పువ్వు గుర్తుకు వేయాలని ఈటల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు