ప్రకృతి వైద్యానికి కేరాఫ్‌గా హైదరాబాద్‌

31 Jul, 2022 01:04 IST|Sakshi

నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రి అభివృద్ధికి మంత్రి హరీశ్‌ ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌: ప్రకృతి వైద్యానికి హైదరాబాద్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా మారాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇందుకు గాంధీ నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రిని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు కల్పించేందుకు రూ.6 కోట్లు మంజూరు చేస్తున్నామని, వెంటనే టెండర్‌ ప్రక్రియ చేపట్టి పనులు మొదలు పెట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

హరీశ్‌రావు ఆదేశాలతో ఇప్పటికే విజయవాడలోని మంతెన సత్యనారాయణ ప్రకృతి వైద్యశాలను అధికార బృందం అధ్యయనం చేసి వచ్చింది. ఈ నివేదికపై అరణ్య భవన్‌లో శనివారం ఆయుష్‌ డైరెక్టర్‌ ప్రశాంతి, హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ సెక్రెటరీ రిజ్వీ, డీఎంఈ రమేశ్‌రెడ్డి, నేచర్‌ క్యూర్‌ హాస్పిటల్‌ డాక్టర్లు, ఆఫీసర్లు మంత్రితో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ, హైదరాబాద్‌ అన్ని రంగాల్లో ముందుందని తెలిపారు. అయితే ప్రకృతి వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా హైదరాబాద్‌కే వచ్చేలా గాంధీ నేచర్‌ క్యూర్‌ హాస్పిటల్‌ను తీర్చిదిద్దాలని ఆదేశించారు. నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రిలో నాచురోపతి ఓపీ, ఐపీ సేవలకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రకృతి వైద్యానికి తగిన విధంగా వాతావరణం ఉండేలా పచ్చదనాన్ని పెంచాలన్నారు 

మరిన్ని వార్తలు