111 రోజులు చికిత్స.. ప్రభుత్వాసుపత్రి ప్రాణం పోసింది.. మంత్రి హరీశ్‌రావు అభినందనలు

20 Jul, 2022 02:33 IST|Sakshi
సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో శిశువుకు అందిస్తున్న చికిత్సను పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు 

నెలలు నిండని శిశువుకు ప్రత్యేక చికిత్స 

ప్రైవేటులో చేతులెత్తేస్తే.. బతికించిన ప్రభుత్వాస్పత్రి వైద్యులు

111 రోజుల చికిత్సతో 1.30 కిలోలకు వచ్చిన శిశువు 

సంగారెడ్డి వైద్యులకు మంత్రి హరీశ్‌రావు అభినందనలు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఆ పాప ఆరు నెలలకే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చింది.. అదీ కేవలం 600 గ్రాముల బరువుతో! పుట్టగానే కదలిక లేదు. దాదాపు ఆశలు వదులుకున్న శిశువుకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నారు సంగారెడ్డిలోని ప్రభుత్వాస్పత్రి వైద్యులు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 111 రోజులపాటు చికిత్స అందిస్తూ శిశువు ఆరోగ్యాన్ని మెరుగుపరచగలిగారు.

ప్రస్తుతం ఈ శిశువు బరువు 1.30 కిలోలకు పెరిగి ఆరోగ్యం మెరుగుపడింది. ప్రైవేటు ఆస్పత్రి వైద్యులే చేతులెత్తేస్తే.. ప్రభుత్వాస్పత్రి వైద్యులు ప్రతిష్టాత్మకంగా చికిత్స అందించి శిశువును కాపాడారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం ఆ ఆస్పత్రికి వెళ్లి వైద్యులను అభినందించారు. పాప తల్లిదండ్రులను పలకరించి ధైర్యం చెప్పారు. 

నిలోఫర్‌ వైద్యులూ కష్టమేనన్నారు.. 
సంగారెడ్డి పట్టణానికి చెందిన అరుంధతి గర్భం దాల్చిన ఆరు నెలలకే ఉమ్మనీరు బయటకు వచ్చింది. పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే.. తక్షణం ఆపరేషన్‌ చేయాలని నిర్ణయించిన వైద్యులు సిజేరియన్‌ చేసి పాపను బయటకు తీశారు. ఆరు నెలలకే పుట్టడంతో పరిపక్వత లేని అవయవాలతో ఉన్న శిశువుకు ఊపిరి పీల్చడమే ఇబ్బందిగా ఉంది. బతకడం కష్టమని వైద్యులు తేల్చేయడంతో తల్లీబిడ్డను సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

క్రిటికల్‌ కేసు కావడంతో హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. అంబులెన్స్‌లో అక్కడికి తరలించి చికిత్స చేయించగా పాప బతకడం కష్టమని అక్కడి వైద్యులు తేల్చిచెప్పారు. అప్పుడప్పుడు కాళ్లు, చేతు­లు మాత్రమే ఆడిస్తున్న పాపను తిరిగి తల్లి చికిత్స పొందుతున్న సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డా.అశోక్, డా.షబ్బీర్, డా.శశికళ, డా.సతీశ్‌లతో కూడిన చిన్న పిల్లల ప్రత్యేక వైద్య నిపుణుల బృందం పాపను నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉంచి చికిత్స అందించారు.

తీవ్ర రక్తహీనతతో ఉండటంతో శిశువుకు ఆరుసార్లు రక్తం ఎక్కించారు. శిశువు అవయవాలు అపరిపక్వతతో ఉండటంతో ఇన్‌ఫెక్షన్‌ సోకే పరిస్థితి ఏర్పడింది. ఫిట్స్‌ కూడా వచ్చే పరిస్థితి ఉన్న ఈ శిశువుకు ప్రత్యేక వైద్య చికిత్స అందించారు. బరువు పెరిగేందుకు స్పెషల్‌ న్యూట్రిషిన్‌ సప్లిమెంటరీలు ఇచ్చారు. 111 రోజుల తర్వాత శిశువు ఆరోగ్యం కుదుటపడింది. ప్రస్తుతం 1.30 కిలోలకు చేరిన శిశువుతోపాటు, తల్లిని కూడా కొద్దిరోజుల్లోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయాలని వైద్యులు భావిస్తున్నారు. ఇలాంటి క్రిటికల్‌ కేసు ఈ మధ్యకాలంలో జిల్లాలో మొదటిసారని డా.సతీష్‌ ‘సాక్షి’తో పేర్కొన్నారు. మెరుగైన చికిత్స అందించిన వైద్యులకు, వైద్య సిబ్బందికి తల్లి అరుంధతి కృతజ్ఞతలు తెలిపారు. 

>
మరిన్ని వార్తలు