సిద్దిపేటలో తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ ప్రారంభం

2 Feb, 2021 21:53 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ను, అలాగే రోగుల సహాయకుల కోసం విశ్రాంతి గదిని మంత్రి హరీష్‌రావు మంగళవారం ప్రారంభించారు. డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో 57 రకాల పరీక్షలను ఉచితంగా చేస్తారని ఆయన వెల్లడించారు. పేద ప్రజలు ఆసుపత్రికి వెళితే వివిధ రకాల పరీక్షలకు వేలల్లో డబ్బులు ఖర్చవుతుంన్నందున, ప్రభుత్వమే ఉచితంగా పరీక్షలు చేయాలని నిర్ణయించి తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్లకు శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ఆసుపత్రులను పట్టించుకునే వారు కాదని, తమ ప్రభుత్వం వచ్చాక పేద ప్రజల కోసం ఎన్నో ఆసుపత్రులను నిర్మించి, అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ హయాంలోనే ప్రభుత్వ ఆసుపత్రులంటే పేద ప్రజలకు నమ్మకం ఏర్పడిందని తెలిపారు.

గతంలో సిద్దిపేట ప్రజలు వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాలకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకునే వారని, ఇప్పుడు సిద్దిపేటలోనే 57 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేయించుకునే సౌలభ్యాన్ని తమ ప్రభుత్వం కల్పించిందని మంత్రి వెల్లడించారు. పరీక్షల అనంతరం రోగి ఫోన్‌కు రిపోర్టులు మెసేజ్ రూపంలో వెళ్తాయని వివరించారు.  
రెండున్నర కోట్ల నిధులతో ఈ సెంటర్‌ను ప్రారంభించామని, రానున్న రోజుల్లో అల్ట్రా సౌండ్ ,ఈసీజీ వంటి పరికరాలను అందుబాటులోకి తెస్తామని, మరో వారం రోజుల్లో సిటీ స్కాన్‌ను ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దాదాపు 35 వేల మందికి ప్రతి రోజు పరీక్షలు చేసే సామర్థ్యం ఉన్న పరికరాలను అందుబాటులోకి తెచ్చామని, సిద్దిపేట ప్రజలు ఈ సేవలకు వినియోగించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు