అభివృద్ధిలో ‘అధ్యయనాలు’ కీలకం 

19 Feb, 2022 05:30 IST|Sakshi
బాలికల వసతి గృహానికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు   

మంత్రి హరీష్రావు

సనత్‌నగర్‌: ప్రజల సమగ్ర ఆర్థిక, సామాజిక స్థితిగతులపై పాలకులకు పూర్తిస్థాయి అవగాహన ఉన్నప్పుడే ఏ దేశమైనా, రాష్ట్రమైనా పురోగతి సాధిస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు. బేగంపేటలోని సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌) ప్రాంగణంలో సుమారు రూ.5 కోట్ల వ్యయంతో నిరి్మంచనున్న బాలికల వసతి గృహం పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా  హరీష్  రావు మాట్లాడుతూ ముఖ్యంగా ఆర్థిక, సామాజిక అధ్యయనాలు లేకుండా రాష్ట్రాల పురోగతికి అడుగులు ముందుకుపడవన్నారు. కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన వెంటనే ఆ బడ్జెట్‌ రాష్ట్రాలకు ఏవిధంగా ఉపయోగపడుతుంది.. రాష్ట్రాలు ఆ బడ్జెట్‌ నుంచి ఏవిధంగా నిధులు సమకూర్చుకునేందుకు అవకాశం ఉంటుంది.. సామాజిక, ఆర్థిక అవసరాలకు ఏమేర నిధులను ఉపయోగించుకోవచ్చో సెస్‌ వేదికగా విశ్లేషణలు జరగాలన్నారు.

ఆర్థిక, సామాజిక అంశాలపై విస్తృతంగా అధ్యయనాలు జరిపి పాలకులకు విలువైన సమాచారాన్ని అందిస్తున్న సెస్‌ మరింతగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ యూనివర్సిటీతో కలిసి ఇక్కడ నిర్వహిస్తున్న పీహెచ్‌డీ కోర్సులో జాతీయ స్థాయిలో విద్యార్ధులు చేరుతున్నారని, ఈ నేపథ్యంలో వారు వసతికి ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా రూ.5 కోట్లతో ఇక్కడ బాలికల వసతి గృహం ఏర్పాటుచేసుకోవడం జరుగుతుందన్నారు. సెస్‌ డైరెక్టర్‌ రేవతి మాట్లాడుతూ 2016 నుంచి ఇక్కడ పీహెచ్‌డీ కోర్సును నిర్వహిస్తున్నారన్నారు.  

మరిన్ని వార్తలు