కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టారు 

13 May, 2022 04:13 IST|Sakshi
నర్సుల దినోత్సవం సందర్భంగా కేక్‌ కట్‌ చేస్తున్న మంత్రి హరీశ్‌రావు, చిత్రంలో డీఎంఈ రమేశ్‌రెడ్డి 

నర్సుల సేవలకు వెలకట్టలేం 

4,722 స్టాఫ్‌నర్సుల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌  

నర్సింగ్‌ కౌన్సిల్‌ బలోపేతానికి,డైరెక్టరేట్‌ ఏర్పాటుకు కార్యాచరణ  

ప్రపంచ నర్సుల దినోత్సవంలో మంత్రి హరీశ్‌రావు  

గాంధీఆస్పత్రి: కరోనా బారిన పడ్డవాళ్లను కన్నవాళ్లు, కట్టుకున్నవాళ్లూ వదిలేస్తే, ప్రాణాలను పణంగా పెట్టి నర్సింగ్‌ సిబ్బంది సేవలు అందించారని, వారి సేవలకు వెలకట్టలేమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కొనియాడారు. కోవిడ్‌తో మృతి చెందిన నర్సుల కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని తెలిపారు. ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీ మెడికల్‌ కాలేజీలోని వివేకానంద ఆడిటోరియంలో గురువారం జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వైద్యరంగంలో తెలంగాణ నంబర్‌వన్‌ కావాలని, అందుకు నర్సింగ్‌ సిబ్బంది తమవంతు కృషి చేయాలని అన్నారు. 4,722 స్టాఫ్‌నర్సుల పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేస్తామన్నారు. నర్సింగ్‌ కౌన్సిల్‌ బలోపేతానికి ప్రణాళికలు రూపొందించామని, నర్సింగ్‌ డైరెక్టరేట్‌ విషయమై సీఎం కేసీఆర్‌తో చర్చించామని, ఆయన పాజిటివ్‌గా ఉన్నారని వివరించారు.

నర్సింగ్‌ విద్యను పటిష్ట పరిచేందుకు జిల్లాకు ఒకటి చొప్పున 33 బీఎస్‌సీ నర్సింగ్‌ కాలేజీల ఏర్పాటుతో పాటు నర్సింగ్‌ స్కూళ్లను అప్‌గ్రేడ్‌ చేస్తామని తెలిపారు. నర్సింగ్‌ విద్యలో మార్పులకు అనుగుణంగా ఎస్‌ఎన్‌సీయూ, ఆంకాలజీ, మెంటల్‌ హెల్త్‌ విభాగాల్లో స్పెషలైజేషన్‌ శిక్షణ ఇస్తామన్నారు. చిత్తశుద్ధితో విధులు నిర్వహించిన 33 జిల్లాలకు చెందిన 106 మంది స్టాఫ్‌నర్సులు, ఆరుగురు నర్సింగ్‌ సూపరింటెండెంట్లకు అవార్డు, ప్రశంసాపత్రాన్ని అందించారు.

కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్లు వాకాటి కరుణ, అజయ్‌కుమార్, డీఎంఈ రమేశ్‌రెడ్డి, డీహెచ్‌ శ్రీనివాసరావు, గాంధీ, ఉస్మానియా సూపరింటెండెంట్లు రాజారావు, నాగేందర్, గాంధీ వైస్‌ ప్రిన్సిపాల్‌ కృష్ణమోహన్, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ విజయనిర్మల, నర్సింగ్‌ పిన్సిపాల్స్‌ విద్యుల్లత, విజయ, వివిధ జిల్లాలకు చెందిన నర్సింగ్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు