Telangana: త్వరలో 13వేల పోస్టులు భర్తీ

12 May, 2022 09:03 IST|Sakshi

మంత్రి హరీశ్‌రావు వెల్లడి

బస్తీ దవాఖానాలతో సుస్తీ తొలగిస్తాం

నిమ్స్‌లో మరో 2వేల బెడ్లు

త్వరలో టీ–డయాగ్నొస్టిక్‌ కేంద్రాల్లో 134 రకాల పరీక్షలు 

టీ–డయాగ్నొస్టిక్‌ మొబైల్‌యాప్‌ ఆవిష్కరణ

సాక్షి,మణికొండ(హైదరాబాద్‌): దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ఏటా రూ.11 వేల కోట్లు ప్రజల ఆరోగ్యానికి ఖర్చుచేస్తున్నామని వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చెప్పారు. ప్రజలకు సమీపంలోనే బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసి వారి సుస్తీని తొలగిస్తున్నామన్నారు. వైద్యరంగంలో ఖాళీగా ఉన్న 13 వేల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. బుధవారం ఆయన విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో కలిసి నార్సింగి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో టీ–డయాగ్నొస్టిక్స్‌ మినీ హబ్, టీ–డయాగ్నొస్టిక్‌మొబైల్‌యాప్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో బస్తీ దవాఖానా, ఆరోగ్య పరీక్షా కేంద్రాలను కనుక్కునేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆ సమస్యను తొలగించేందుకే మొబైల్‌యాప్‌ను రూపొందించామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల పనితీరును మెరుగుపర్చేందుకూ యాప్‌ ద్వారా ప్రజలు ఫిర్యాదులు చేయొచ్చని చెప్పారు. ప్రజల ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన రికార్డులను భద్రపరిచే వ్యవస్థను ప్రస్తుతం సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ప్రారంభించామని, రాబోయే రోజుల్లో దీన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తామని తెలిపారు.

నిమ్స్‌లో మరో 2వేల బెడ్లతో..
రాష్ట్రంలో బ్రిటిష్‌వారు కట్టిన గాంధీ ఆసుపత్రి, నిజాం నవాబులు కట్టిన ఉస్మానియా ఆసుపత్రులు మాత్రమే గతంలో ఉండేవని ప్రస్తుతం హైదరాబాద్‌ నలువైపులా 4 సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులను రూ.1,200 కోట్లతో నిర్మిస్తున్నామని హరీశ్‌రావు చెప్పారు. వాటిల్లో 4వేల బెడ్లతోపాటు నిమ్స్‌లో మరో 2వేల బెడ్లను ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. 7లక్షల చదరపు అడుగులతో కొత్త భవనం నిర్మించి గచ్చిబౌలిలోని టిమ్స్‌ను 2వేల పడకల ఆసుపత్రిగా మారుస్తామని తెలిపారు. ప్రస్తుతం టీ–డయాగ్నొస్టిక్‌ కేంద్రాల్లో 57 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారని, త్వరలో వాటిని 134కు పెంచుతామని ప్రకటించారు.

విద్య, వైద్యానికి పెద్దపీట: మంత్రి సబితారెడ్డి
పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు, వారు జబ్బు చేస్తే చూపించుకునే ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం భారీగా నిధులను కేటాయిస్తోందని మంత్రి పి.సబితారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలోనూ త్వర లో బస్తీ దవాఖానాలుఏర్పాటు చేస్తామన్నారు. 

చదవండి: దక్షిణ డిస్కంలో తొలి లైన్‌ఉమెన్‌గా శిరీష

మరిన్ని వార్తలు