చేపలను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరాం: మంత్రి హరీశ్‌రావు

9 Sep, 2021 03:16 IST|Sakshi

కులవృత్తులకు పూర్వవైభవం తీసుకువస్తాం: మంత్రి తలసాని 

ఉచిత చేపపిల్లల పంపిణీని ప్రారంభించిన మంత్రులు  

సిద్దిపేటజోన్‌: ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన మత్స్యరంగానికి తెలంగాణ రాష్ట్రంలో ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ఏడేళ్లలో చేపలను ఉత్తర భారతదేశంతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని ఆయన పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్‌ మండలంలోని రంగనాయకసాగర్, సిద్దిపేట పట్టణంలోని కోమటిచెరువులో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలసి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని హరీశ్‌రావు లాంఛనంగా ప్రారంభించారు.

గోదావరి, కృష్ణా జలాల్లో పెరిగే తెలంగాణ చేపలకు మంచి డిమాండ్‌ ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో నీలి విప్లవానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలో రూ.4.87 కోట్లతో అన్ని జలాశయాల్లో 4కోట్ల19 లక్షల చేప, రొయ్య పిల్లలను వదులుతున్నామన్నారు. తెలంగాణ నేడు దేశానికి అన్నపూర్ణగా, ధాన్యపు భాండాగారంగా మారిందని, ఎక్కడ చూసినా ధాన్యం, మత్స్య సంపద కళ్ల ముందు కనిపిస్తోందని చెప్పారు.  

కుల వృత్తులకు పూర్వవైభవం:  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కులవృత్తులకు పూర్వవైభవం కోసం కృషి చేస్తోందని మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాల మెరుగు కోసం తమ ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 93 కోట్ల చేప పిల్లలను, 20 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేస్తోందన్నారు.

రెండేళ్లలో ఫెడరేషన్‌ ద్వారా చేప పిల్లలను కొని మార్కెటింగ్‌ చేయాలనే కార్యాచరణకు రూపకల్పన చేస్తున్నామన్నారు. అప్పుడు చేపలకు మంచి ధర వస్తుందన్నారు. అప్పటివరకు మత్స్యకారులు చేపలను తక్కువ ధరకు అమ్మకుండా డిమాండ్‌ ఉన్న హైదరాబాద్, ఇతర రాష్ట్రాలలో బహిరంగ మార్కెట్‌లో విక్రయించి లాభాలు పొందాలని సూచించారు. భవిష్యత్‌లో మొబైల్‌ ఔట్‌ లెట్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.

మురిసిన మంత్రి హరీశ్‌రావు
చెరువులో చేప పిల్లలను వదిలే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రికి ఓ చేపపిల్లను చూడగానే తె లియని ఆనందం కలిగింది. దాన్ని చేతితో పట్టుకుని చూస్తూ మురిసిపోయారు. అనంతరం ఆ చేపను నీటిలో వదిలారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటిచెరువులో మంత్రి హరీశ్‌రావు చేపపిల్లలను వదులుతుండగా ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు