మనమే నం.1.. మంత్రి హరీశ్‌ వెల్లడి

24 Aug, 2021 02:14 IST|Sakshi

రాష్ట్ర ఆర్థిక పరిపుష్టిపై సందేహాలు అనవసరం

కేంద్రం లెక్కలు, నివేదికలే ఈ విషయం స్పష్టం చేస్తున్నాయ్‌

రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌ వెల్లడి

గత ఆరేళ్లుగా స్థిరమైన ఆర్థికాభివృద్ధి నమోదు

ఏటా జాతీయ సగటు కంటే ఎక్కువగానే వృద్ధి రేటు

జీఎస్‌డీపీ వృద్ధిలో మూడో స్థానంలో రాష్ట్రం .. తలసరి ఆదాయంలో కూడా..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక పరిపుష్టిపై ఎవరికీ సందేహాలు అవసరం లేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ లెక్కలు, నివేదికల ప్రకారమే తెలం గాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నట్టుగా తెలుస్తోందని స్పష్టం చేశారు. గత ఆరేళ్లుగా స్థిరమైన ఆర్థికాభివృద్ధిని తెలంగాణ నమోదు చేస్తోందని, ప్రతి ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగానే ఉందని తెలిపారు. సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్‌ ఎంపీ బీబీ పాటిల్, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, కార్యదర్శి రొనాల్డ్‌రోస్, ఆర్థిక సలహాదారు జీఆర్‌రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి, జాతీయ సగటు తదితర అంశాలకు సంబంధించిన గణాంకాలను వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘జీఎస్‌డీపీ’లో ఆరో అతిపెద్ద రాష్ట్రం
గత ఆరేళ్లలో జాతీయ స్థూల ఉత్పత్తి (జీఎస్‌ డీపీ) వృద్ధిలో రాష్ట్రం మూడో స్థానంలో నిలి చింది. జీఎస్‌డీపీ భాగస్వామ్యంలో ఆరో అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. జనాభా పరంగా మనది 12వ రాష్ట్రం.. భౌగోళికంగా 11వ స్థానం.. అయినా జీఎస్‌డీపీలో మాత్రం ఆరోస్థానానికి ఎదిగాం. కరోనా క్లిష్ట సమయంలో కూడా సానుకూల వృద్ధిని నమోదు చేశాం. ఈ సమయంలో దేశ అభివృద్ధి సగటు –3 శాతం ఉంటే, తెలంగాణలో వృద్ధి రేటు 2.4గా నమోదైంది. జీఎస్‌డీపీ వార్షిక వృద్ధి రేటులో దేశ సగటు 8.1 శాతం ఉంటే తెలంగాణ 11.7 శాతం నమోదు చేసింది. ఇందుకు సీఎం కేసీఆర్‌ ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్న విధానాలే కారణం.

తలసరి ఆదాయంలో జాతీయ సగటు రూ.1,28,289 అయితే తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,37,632. తలసారి ఆదాయంలో రాష్ట్రం ఏర్పాటైన రోజున తెలంగాణ ఏడో స్థానంలో ఉంటే ఇప్పుడు మూడోస్థానానికి ఎగబాకింది. తలసరి ఆదాయం విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ నం.1గా నిలిచింది. ఇది సీఎం కేసీఆర్‌ కృషి, ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తుంది. 2019–20 సంవత్సరంలో జీఎస్‌డీపీ వృద్ధి రేటు భారత్‌లో 2.5 శాతం ఉంటే, బంగ్లాదేశ్‌లో 8.1 శాతంగా నమోదైంది. దేశ ఆర్థిక పరిస్థితిని బీజేపీ బలహీనపర్చి బంగ్లాదేశ్‌కన్నా దిగజార్చింది. 

వ్యవసాయ రంగంలో అద్భుత ప్రగతి
    మిషన్‌ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, గొర్రెలు, చేపపిల్లల పంపిణీ, డెయిరీ అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో వ్యవసాయ రంగం అద్భుత ప్రగతి సాధించినట్టుగా కేంద్రం చెబుతున్న లెక్కలే వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో ఏకంగా 11.52 శాతం వృద్ధి నమోదైంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో దేశ అభివృద్ధి 3.6గా ఉంటే తెలంగాణలో 14.3గా ఉంది. తయారీ రంగంలో 2014–15తో పోలిస్తే 72 శాతం వృద్ధి సాధించాం. ఐటీ సెక్టార్‌లో 120 శాతం అభివృద్ధి జరిగింది. 

ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి లోపే అప్పులు  రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నామన్న ప్రతిపక్షాల వ్యాఖ్యల్లో వాస్తవం లేదు. అప్పులు ఎడాపెడా తీసుకునే అధికారం రాష్ట్రాలకు లేదు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం జీఎస్‌డీపీలో 25 శాతం వరకు అప్పు తీసుకునే వెసులుబాటు ఉంది. కానీ మన రాష్ట్రం ఆ పరిమితికి లోబడి 22.83 శాతం మాత్రమే అప్పుగా తీసుకుంటోంది. 

అందరికీ దళిత బంధు
    దళితబంధు పథకాన్ని రాష్ట్రమంతటా అమలుచేస్తాం. అన్ని దళిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తాం. ఈ పథకం ద్వారా దళితుల అభివృద్ధికి పెట్టుబడి పెడుతున్నాం. ఆ పెట్టుబడితో ఆయా వర్గాలు మళ్లీ రాష్ట్రానికి సంపదను సృష్టిస్తాయి. దళిత బంధుకు నిధుల కొరత గురించి ఆలోచించాల్సిన పనిలేదు. నిరర్ధక ఆస్తులను అమ్మయినా నిధులను సమకూరుస్తాం. 

తుది దశకు ఉద్యోగాల భర్తీ కసరత్తు
    ఉద్యోగాల భర్తీకి సంబంధించి చేస్తున్న కసరత్తు తుది దశకు చేరింది. జిల్లాల విభజన కారణంగా కొత్త జిల్లాల్లో లోకల్‌ రిజర్వేషన్‌ కోసం పోస్టుల గుర్తింపు, జోనల్, మల్టీజోనల్‌ పోస్టుల గుర్తింపు లాంటివి జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఈ కసరత్తును పూర్తి చేశాం. త్వరలోనే కేబినెట్‌కు అన్ని వివరాలు సమర్పిస్తాం. కేబినెట్‌ ఆమోదం అనంతరం దశల వారీగా నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తాం. 


కిషన్‌రెడ్డి నిధులు, ప్రాజెక్టులు తెచ్చి మాట్లాడాలి
    బీజేపీ నేత కిషన్‌రెడ్డి ఏదైనా మాట్లాడదల్చుకుంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను తెచ్చి మాట్లాడాలి. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు.. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలవుతుంటే చెప్పాలి. ఫలానా రాష్ట్రంలో అమలవుతున్నాయంటే అక్కడకు అందరం వెళ్దాం. బీజేపీ చేసిన చేసిన అభివృద్ధి, సాధించిన పురోగతి ఏదైనా ఉందంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ ధరల పెంపు మాత్రమే. ఆస్తులు, రోడ్లు, విమానాశ్రయాలు, ఎల్‌ఐసీ వంటి సంస్థలు, నవరత్నాలను అమ్మడంలో బీజేపీ పురోగతి సాధించింది. 

ద్వితీయ స్థానం కోసమే ప్రతిపక్షాల పోరాటం
    రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఎజెండా లేకుండా పోయింది. బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్రంలో ప్రత్యామ్నాయం తామంటే తామేనని చెప్పుకునేందుకే టీఆర్‌ఎస్‌ను విమర్శిస్తున్నాయి. వారు చేసే విమర్శలు వారికే సెల్ఫ్‌ గోల్‌ మాదిరి అవుతున్నాయి. ప్రజలు కూడా ఈ విమర్శలను మెచ్చుకోవడం లేదు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తక్కువ సమయంలోనే ఎవరూ సాధించలేని విజయాలను సాధించాం. ఈ విషయంలో ప్రతిపక్షాలు మమ్మల్ని మెచ్చుకోకపోయినా ఫర్వాలేదు. కానీ రాష్ట్రం పరువును తీసేవిధంగా తెలంగాణ ఆగమైందని, తాలిబాన్ల రాజ్యంగా మారిందనే వ్యాఖ్యలు చేయొద్దు. ఎన్ని విమర్శలు చేసినా కాంగ్రెస్, బీజేపీలు పోరాడేది ద్వితీయ స్థానం కోసమే.
కేసీఆర్, టీఆర్‌ఎస్‌ ఉన్నంత కాలం వారు ప్రథమ స్థానంలోకి రాలేరు. ఏ రాష్ట్ర అభివృద్ధినైనా తలసరి విద్యుత్‌ వినియోగంతో పోల్చి చూస్తారు. 1,896 యూనిట్ల తలసరి విద్యుత్‌ వినియోగంతో రాష్ట్రం దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ మాత్రమే. రాష్ట్రంలో సేవల రంగం 2014–15తో పోలిస్తే 1.5 రెట్లు వృద్ధి చెందింది. ఐటీ ఉత్పత్తుల విలువ 120 శాతం పెరిగింది. 2014–15లో రూ.66,276 కోట్ల విలువైన ఐటీ ఉత్పత్తులు సాధిస్తే ఇప్పుడు రూ.1,45,522 కోట్ల ఉత్పత్తులు సాధించాం. గాం«ధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం నేడు తెలంగాణలో కనిపిస్తోంది.     – మంత్రి హరీశ్‌ 

చదవండి: హైదరాబాద్‌లో రేసింగ్‌.. కుర్ర‘కారు’.. హుషారు

మరిన్ని వార్తలు