విప్లవాత్మక విధానాలతోనే వెల్లువలా పెట్టుబడులు 

24 Jul, 2022 01:37 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న  హరీశ్‌రావు 

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు

గచ్చిబౌలి: వరల్డ్‌ టాప్‌ 5 టెక్‌ కంపెనీలకు హైదరాబాద్‌ నిలయంగా మారిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశనలో తెలంగాణ ప్రభుత్వ అమలు చేస్తున్న విప్లవాత్మకమైన విధానాలు హైదరాబాద్‌ను ప్రపంచ పెట్టుబడులకు నిలయంగా మార్చాయన్నారు. గచ్చిబౌలిలో ఎస్పైర్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను ఆయన శనివారం ప్రారంభించారు.

అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో ఐటీ రంగం ఎంతో అభివృద్ధి సాధిస్తోందన్నారు. నీతి ఆయోగ్‌ ఆవిష్కరణల ర్యాంకింగ్‌లో తెలంగాణ ద్వితీయ స్థానంలో నిలవగా, డబుల్‌ ఇంజిన్‌ గ్రోత్‌ రాష్ట్రాలు చాలా వెనుకబడ్డాయని పేర్కొన్నారు. కర్ణాటక, తెలంగాణ మొదటి, రెండు స్థానాల్లో ఉంటే గుజరాత్, బీహార్‌ 14, 15 స్థానాల్లో ఉన్నాయన్నారు.

ఫ్లోరిడా, యూఎస్‌ఏ ఆధారిత సాంకేతిక సేవల సంస్థ అయిన ఫోనిక్స్‌ టెక్నాలజీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఎస్పైర్‌ ఏర్పాటు చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. తెలుగు విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి నిమిత్తం ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. మూడేళ్లలో 3 వేల కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉండేలా కంపెనీని విస్తరించాలని ఆకాంక్షించారు. తెలంగాణ యువతకు ఎంతో నైపుణ్యం ఉందని, నూతన అవకాశాలు కూడా అనేకం ఉన్నాయని మంత్రి అన్నారు.

ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్‌ గ్రోత్‌ విధానానికి తోడు అద్భుతమైన ప్రభుత్వ విధానాలు శాంతిభద్రతల నిర్వహణ, రాజకీయ సుస్థిరత, ఇక్కడి భౌగోళిక వాతావరణం వల్లే సాధ్యమమైందని చెప్పారు. పనిలో నిబద్ధత, లక్ష్యంపై స్పష్టత ఉంటే అత్యున్నత శిఖరాలకు ఎదగవచ్చని యువతకు సూచించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, వోడితెల సతీశ్‌కుమార్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్‌ కొమిరిశెట్టి సాయిబాబా, ఎస్పైర్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు