ప్రజల భాగస్వామ్యం ఉంటే విజయవంతం 

24 Jan, 2023 02:10 IST|Sakshi
సభలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు. చిత్రంలో మల్లారెడ్డి, అంబటి రాంబాబు 

బాలవికాస సంస్థ మహాసభలో మంత్రి హరీశ్‌రావు 

కీసర: స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేస్తే విజయవంతమవుతాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీర్‌ హరీశ్‌రావు అన్నారు. సోమవారం రాంపల్లిదాయరలో బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అభివృద్ధి కమిటీల మహాసభకు హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. జన నిర్మాణంతోనే సమాజం నిర్మితమవుతుందని, ఇందుకు బాలవికాస సంస్థ చేపడుతున్న పనులే నిదర్శనమన్నారు.

బాలవికాస నీటి శుద్ధి ప్లాంటు ఏర్పాటుచేస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఆ స్ఫూర్తితో మిషన్‌ భగీరథను తెచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఈ సంస్థ గ్రామాల్లో సేవాగుణం గలవారిని కమిటీలుగా నియమించి వారికి శిక్షణ ఇచ్చి కార్యక్రమాలను నడిపించడం గొప్పవిషయమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, చామకూర మల్లారెడ్డి, బాలవికాస వ్యవస్థాపకుడు ఆండ్రూ జింగ్రాస్, సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శౌరీరెడ్డి పాల్గొన్నారు. బాల వికాస సంస్థ 23 బ్రాంచీలు ఏర్పాటుచేసి 8 వేల గ్రామాల్లో కార్యక్రమాలు చేపడుతోంది.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు