జీఎస్టీ పరిహారం.. కేంద్రం బాధ్యతే

28 Aug, 2020 02:43 IST|Sakshi

తెలంగాణకు రావాల్సిన 8,120 కోట్లు చెల్లించండి

సెస్‌ ఎక్కువ చెల్లిస్తూ తక్కువ తీసుకుంటున్నాం

జీఎస్టీ కౌన్సిల్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు 

సాక్షి, హైదరాబాద్‌: వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో చేరడం వల్ల రాష్ట్రాల ఆదాయానికి ఎలాంటి నష్టమూ వాటిల్లదని కేంద్రం హామీ ఇచ్చినందునే అన్ని రాష్ట్రాలూ జీఎస్టీని అమలు చేస్తున్నాయని, అలాంటప్పుడు నష్టపోయిన సందర్భంలో రాష్ట్రా లకు జీఎస్టీ పరిహారం చెల్లించే బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని రాష్ట్ర ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. జీఎస్టీలో చేరడం వల్ల రాష్ట్రాలు 60–70% ఆదాయాన్ని కోల్పోతే, కేంద్రం నష్టపో యింది 31 శాతమేనన్నారు. అందువల్ల రాష్ట్రాలకు కేంద్రం పరిహారం చెల్లించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగింది. ఇందులో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులూ పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని బీఆర్‌కేఆర్‌ భవన్‌ నుంచి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ అమలు చేయడం వల్ల రాష్ట్రాలకు లోటు ఏర్పడితే ఏదో రూపంలో పరిహారం చెల్లిస్తామని, కన్సాలిడేటెడ్‌ నిధుల నుంచి లేదా అప్పు చేసి అయినా ఇస్తామని గతంలో జరిగిన కౌన్సిల్‌ సమావేశాల్లో కేంద్రం హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

దీనిపై చర్చించాల్సిన అవసరం కూడా లేదని, వెంటనే రాష్ట్రాలకు రావాల్సిన పరిహారాన్ని కేంద్రం ఇవ్వాలని కోరారు. తెలంగాణకు జీఎస్టీ పరిహారం కింద రూ.5,420 కోట్లతోపాటు ఐజీఎస్టీ కింద రావాల్సిన రూ.2,700 కోట్లు ఇవ్వాలని కోరారు. జీఎస్టీ పరిహారంలో సెస్‌ మిగిలితే కేంద్రం కన్సాలిడేటెడ్‌ ఫండ్‌లో జమ చేసి వాడుకుంటోందని, కానీ సెస్‌ తగ్గినపుడు రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలని సూచించడం సమంజసం కాదని హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌ ప్రభావం దేశంలో ఎంత కాలం ఉంటుందో తెలియనందున రెవెన్యూ లోటు అర్థం కాని పరిస్థితి రాష్ట్రాలకు ఎదురవుతోందన్నారు. ఇలాంటి సమయంలో కేంద్రమే బాధ్యత తీసుకుని రెండు నెలలకొసారి జీఎస్టీ పరిహారం చెల్లించాలని కోరారు. ఈ విషయంలో బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ మోడీ ఆధ్వర్యంలోని సబ్‌ కమిటీ సమావేశమై విధి విధానాలు రూపొందించాలని సూచించారు. 

ఇచ్చింది 18వేల కోట్లు.. పొందింది 3వేల కోట్లు..
దేశంలోనే అత్యధికంగా జీఎస్టీ చెల్లించే ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, అలాగే అత్యంత తక్కువ పరిహారం తీసుకునే రాష్ట్రాల్లోనూ తెలంగాణ ఉందని హరీశ్‌రావు అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రం జీఎస్టీ సెస్‌ రూపంలో రూ.18,082 కోట్లు చెల్లిస్తే, తిరిగి పొందింది కేవలం 3,223 కోట్లు మాత్రమేనని చెప్పారు. ‘జీఎస్టీ అమలు చేసిన మొదటి సంవత్సరంలో తెలంగాణ 169 కోట్లు మాత్రమే పరిహారం తీసుకుంది. రెండో ఏడాది పరిహారం సున్నా. మూడో ఏడాది స్వల్ప మొత్తమే దక్కింది. సెస్‌ వచ్చే ఈ ఏడాది కోవిడ్‌ అని, జీఎస్టీ అమలు వల్ల నష్టమని విభజిస్తే తీవ్రంగా నష్టపోతాం. రాష్ట్రానికి రావాల్సిన సెస్‌ మొత్తం చెల్లించాలి’ అని హరీశ్‌ గట్టిగా వాదన వినిపించారు.

కాగా, ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు విన్న జీఎస్టీ కౌన్సిల్‌ రెండు ప్రతిపాదనలను రాష్ట్రాల ముందుంచింది. కేంద్రమే రుణం తీసుకుని రాష్ట్రాలకు ఇస్తుందని, అయితే రెవెన్యూ లోటు రూ.1.65 లక్షల కోట్లు మాత్రమే ఈ విధానంలో రాష్ట్రాలకు ఇస్తుందని ప్రతిపాదించింది. అలాగే రెవెన్యూ లోటు రూ.3లక్షల కోట్లను రుణం రూపంలో రాష్ట్రాల పేరుమీద జీఎస్టీ కౌన్సిల్‌ తీసుకుని వడ్డీతో సహా రుణాన్ని చెల్లిస్తామని రెండో ప్రతిపాదన చేసింది. దీనిపై ఏడు పనిదినాల్లో తమ అభిప్రాయాలను వెల్లడించాలని రాష్ట్రాలను కోరింది. సమావేశంలో హరీశ్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు