ఆసుపత్రులు..ఆధునీకరణ

25 Jan, 2022 02:41 IST|Sakshi

ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు: మంత్రి హరీశ్‌

10.84 కోట్లతో దవాఖానాలకు మరమ్మతులు

మరో 20 రక్త నిల్వ కేంద్రాల ఏర్పాటు

విజయవంతంగా కొనసాగుతున్న జ్వర సర్వే

సాక్షి, హైదరాబాద్‌: కొత్త ఆసుపత్రులు, కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుతో పాటు ఉన్న ఆసుపత్రుల ఆధునీకరణ ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇందులో భాగంగా లేబర్‌రూములు, డ్రైనేజీ, విద్యుత్‌ సరఫరా, ఇతర మరమ్మతులతో వీటిని ఆధునీకరించనున్నట్లు చెప్పారు. ముందుగా రాష్ట్రం లోని జిల్లా దవాఖానాలు,  ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో మరమ్మతులు చేపట్ట నున్నట్లు చెప్పారు. రూ.10.84 కోట్ల వ్యయంతో 14 జిల్లాల పరిధిలోని 4జిల్లా దవాఖానాలు, 8 ఏరియా ఆసుపత్రులు, 3 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో మరమ్మతులు చేపడతామని చెప్పారు.

ఈ జాబితాలో నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, సంగా రెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్, నిర్మల్, కరీం నగర్, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, యాదాద్రి భువనగిరి, మెదక్, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి. కరోనా, జ్వర సర్వే, వ్యాక్సినేషన్‌ అంశాలపై వైద్యా రోగ్య అధికారులతో మంత్రి హరీశ్‌రావు సోమ వారం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేష్‌రెడ్డి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ వాకాటి కరుణ, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా కట్టడి కోసం మొదలు పెట్టిన జ్వర సర్వే రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతోందన్నారు.  వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయాలని సూచించారు.

కొత్తగా 20 బ్లడ్‌స్టోరేజీ సెంటర్లు..
రాష్ట్రంలో కొత్తగా 20 బ్లడ్‌స్టోరేజీ సెంటర్లు (రక్త నిల్వ కేంద్రాలు) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కొక్కటి రూ. 12 లక్షల ఖర్చుతో 12 జిల్లాల పరిధిలోని పలు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా ఆస్పత్రుల్లో వీటిని నెలకొల్ప నున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 57 బ్లడ్‌ బ్యాంకులు ఉండగా, 51 బ్లడ్‌స్టోరేజీ సెంటర్లు ఉన్నాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

మరిన్ని వార్తలు