తెలంగాణపై కేంద్రం అక్కసు

28 Jun, 2022 03:58 IST|Sakshi
గజ్వేల్‌లో గూడ్స్‌ రైలును ప్రారంభిస్తున్న మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి తదితరులు

మంత్రి హరీశ్‌రావు ధ్వజం  

కొత్తపల్లి రైల్వేలైన్‌కు కేంద్రం ఇచ్చింది తక్కువే 

మంత్రి నిరంజన్‌తో కలసి గజ్వేల్‌లో గూడ్స్‌రైలును ప్రారంభించిన హరీశ్‌ 

గజ్వేల్‌: తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక కేంద్రం అక్కసు వెళ్లగక్కుతోందని.. నిధులు ఇవ్వకుండా ఆర్థికంగా దెబ్బతీసి ప్రజల్లో తమ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్రకు తెరలేపిందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఎరువుల రేక్‌ పాయింట్, గూడ్స్‌ రైలును వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలసి ప్రారంభించారు.  

ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి వచ్చే బీజేపీ నేతలు వరంగల్‌కు మంజూరైన రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని గుజరాత్‌కు తరలించుకుపోయామని చెబుతారా?, నీతి ఆయోగ్‌ చెప్పినా.. రాష్ట్రానికి రూ.24 వేల కోట్లు ఇవ్వలేదని చెబుతారా?, ఐటీఐఆర్‌ను రద్దు చేశామని చెబుతారా? అంటూ ప్రశ్నిం చారు.  మనోహరాబాద్‌–కొత్తపల్లి రైల్వేలైన్‌ పనుల్లో రాష్ట్రం ఖర్చుపెట్టిందే ఎక్కువన్నారు. భూసేకరణ, ఇతర పనులకు ఇప్పటి వరకు రూ.650 కోట్లు ఖర్చు పెట్టామని వెల్లడించారు.  

రైలు లాభాలు ఇలా.. 
మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ నుంచి కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి వరకు 151.36 కిలోమీటర్ల మేర కొత్తగా బ్రాడ్‌గేజ్‌ రైల్వేలైన్‌ నిర్మాణానికి రూ.1,160.47 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ లైన్‌ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి మనోహరాబాద్‌ మీదుగా కొత్తపల్లి వరకు, అక్కడి నుంచి పెద్దపల్లి గ్రాండ్‌ ట్రంక్‌ లైన్‌తో అనుసంధానం కానుంది. ఫలితంగా ఈ లైన్‌  హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా లాంటి మహానగరాలను కలుపుతూ జాతీయ లైన్‌ గా ఆవిర్భవించనుంది.

ఇది పూర్తయితే.. ప్రయాణికులకు దూరభారం తగ్గనుంది.   సిద్ది పేట జిల్లాతోపాటు మెదక్, సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాలకు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం మనోహరాబాద్‌ నుంచి సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మీదుగా కొడకండ్ల వరకు 43 కి.మీ. పనులు పూర్తయ్యాయి. కాగా, హైదరాబాద్‌లోని ప్రధాన రైల్వేస్టేషన్లకు గజ్వేల్‌ను ప్రత్యామ్నాయంగా మార్చి.. దేశంలోని ముఖ్యమైన నగరాలకు కొన్ని కొత్త రైళ్లను ఇక్కడి నుంచి నడపాలని నిర్ణయించారు.

ఇక్కడి రేక్‌ పాయింట్‌కు తొలిరోజు సోమవారం గూడ్స్‌ రైలు ద్వారా ఏపీలోని కాకినాడ నుంచి నాగార్జున ఫర్టిలైజర్స్‌కు చెందిన 1,300 మెట్రిక్‌ టన్నుల ఎరువులు వచ్చాయి. భవిష్యత్‌లో ఎఫ్‌సీఐ గోదాములకు, అన్ని రకాల వ్యవసాయోత్పత్తుల తరలింపు, కూరగాయల రవాణా కోసం వినియోగించనున్నారు.  

మరిన్ని వార్తలు