ఏమ్మా.. ఎలా చదువుతున్నారు! 

17 Feb, 2021 13:33 IST|Sakshi
సిద్దిపేటలో విద్యార్థులతో మాట్లాడుతున్న ఆర్థిక మంత్రి హరీశ్‌రావు 

 విద్యార్థుల యోగక్షేమాలపై మంత్రి హరీశ్‌రావు ఆరా

సాక్షి, సిద్దిపేట : ‘ఏమ్మా.. ఎలా ఉన్నారు..? కరోనా కారణంగా చదువులకు కొంత ఇబ్బంది కలిగింది.. బాగా చదువుకోండి..’ అంటూ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తన వాహనంలో ఉండి విద్యార్థులను పలకరించారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలో పర్యటిస్తున్న క్రమంలో పాత బస్టాండ్‌ వద్ద చిన్నకోడూరు మండలం మల్యాల గ్రామానికి చెందిన విద్యార్థులు వెళ్తుండగా కాసేపు కారు ఆపి వారితో మాట్లాడారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టిందని, జాగ్రత్తగా చదువుకోవాలని సూచించారు. తన వాహనం నుంచి బిస్కెట్‌ ప్యాకెట్‌ను తీసి విద్యార్థులకు అందించారు. రోజంతా పలు అభివృద్ధి కార్యక్రమాలతో బిజీగా గడిపిన మంత్రి సాయంత్రం కోమటిచెరువపై అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌తో కలిసి సుందరీకరణ పనులను పరిశీలించారు. 

అక్షరాభ్యాసంతో పెరగనున్న జ్ఞానం 
చిన్నకోడూరు(సిద్దిపేట): వసంతి పంచమి రోజున చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానవంతులవుతారని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం చిన్నకోడూరు మండల పరిధిలోని అనంతసాగర్‌ సరస్వతి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశ్వీర్వచనం పొందారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనంతసాగర్‌ సరస్వతీ అమ్మవారు నిలిచియున్న వీణా పుస్తక జపమాలదారిని అన్నారు. ఈ దేవాలయం దేశంలోనే మొదటిది ఇక్కడ ఉండడం మన ప్రాంత అదృష్టమన్నారు.  ఆలయ అవరణంలో రాగి, చీకటి, పాలదోణేలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం మెట్లు నిర్మించేందుకు రూ.10 లక్షలు వినియోగిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎంపీపీ మాణిక్యరెడ్డి, మార్కెట్‌ కమిటీ కాముని శ్రీనివాస్, సర్పంచ్‌ చామకూర విజయ లింగం, ఎంపీటీసీ సరిత పర్శరాములు, ఆలయ ప్రధాన  అర్చకులు నర్సింహరామశర్మ, తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు