నాకు రాజకీయాలంటే ఇష్టం లేదు.. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి భావోద్వేగం

26 Apr, 2023 10:23 IST|Sakshi
భావోద్వేగానికి గురైన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

సాక్షి, నిర్మల్‌: ‘ఇంత వయ సొచ్చినందున ఇక రాజకీయాలంటే ఇష్టం లేదు. భవిష్యత్తులో ఎవరైన వచ్చి నిల్చున్నా అభ్యంతరం లేదు’అంటూ బీఆర్‌ఎస్‌ నిర్మల్‌ నియోజకవర్గ ప్రతినిధుల సమావేశంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. పనితీరు, పథకాల గురించి చెబుతూ నిర్మల్‌ రుణం తీర్చుకునేందుకు ఎన్నో పనులు చేశామన్నారు.

ఈ క్రమంలో ఇంత వయసొచ్చినందున ఇక రాజకీయాలంటే ఇష్టంలేదని, రేపొద్దున ఎవరొచ్చి నిల్చున్నా తనకు అభ్యంతరం లేదన్నారు. దీంతో ఒక్కసారిగా స్టేజీపై, సభలో ఉన్న నాయకులు, కార్యకర్తలు ‘ఐకేరెడ్డి జిందాబాద్‌’అంటూ నినాదాలు చేశారు. అందరూ స్టేజీ వద్దకు వెళ్లి మంత్రికి అండగా ఉంటామని చెప్పారు ఈ క్రమంలో కాసేపు ఇంద్రకరణ్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.

కాగా, ఇటీవలే సీనియర్లు శ్రీహరి రావు, సత్యనారాయణగౌడ్‌ అసమ్మతివర్గంగా తయారు కావడం, కాంగ్రెస్‌ నేత మహేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరడం, మరోవైపు బీఆర్‌ఎస్‌ నుంచి జెడ్పీటీసీ  రాజేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లడం, పలువురు కౌన్సిలర్లనూ బీజేపీ టార్గెట్‌ చేసిన నేపథ్యంలో మంత్రి ఇలా మాట్లాడి ఉంటారన్న చర్చ జరుగుతోంది.  
చదవండి: మున్సిపాలిటీల్లో మైనారిటీలకు కోటా రాజ్యాంగ ఉల్లంఘనే  

మరిన్ని వార్తలు