మహంకాళికి ఆన్‌లైన్‌లో ‘బోనం’

17 Jun, 2022 02:12 IST|Sakshi
ఆన్‌లైన్‌ సేవలు ప్రారంభిస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌ 

ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్‌  

జూలై 4 నుంచి అందుబాటులోకి సేవలు

ఆన్‌లైన్‌లో బల్కంపేట అమ్మవారి కల్యాణ సేవ

సాక్షి, హైదరాబాద్‌: దేశ, విదేశాల్లోని భక్తులు సైతం సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఆన్‌లైన్‌ ద్వారా బోనాలు సమర్పించుకునేలా దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు గురువారం అరణ్య భవన్‌లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు, బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం ఆన్‌లైన్‌ సేవలను మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే.. ఆలయ నిర్వాహకులే అమ్మవారికి బోనం సమర్పిస్తారని, గోత్రనామాలతో పూజలు చేసి అమ్మవారి ప్రసాదం నేరుగా ఇంటికి పంపిస్తారని అన్నారు. ఆ తర్వాత పోస్టు ద్వారా బోనంలోని బియ్యం పంపిణీ చేస్తారని, ఆ బియ్యాన్ని ఇంటి వద్దే వండుకొని ప్రసాదంలా స్వీకరించవచ్చని వివరించారు.

బియ్యంతో పాటు బెల్లం, అక్షింతలు, పసుపు –కుంకుమ పంపిస్తారని చెప్పారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఆన్‌లైన్‌లో బోనం సమర్పించాలనుకునే భక్తులకు జూలై 4 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మీ సేవ, ఆలయ వెబ్‌ సైట్, పోస్ట్‌ ఆఫీస్‌ ద్వారా భక్తులు ఈ సేవలను బుక్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాల భక్తులు రూ.300, ఇతర దేశాల భక్తులు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. వీటిని పోస్ట్‌ ఆఫీస్, ఆర్టీసీ కొరియర్‌ సేవల ద్వారా దేశీయ భక్తుల ఇంటికి చేరవేస్తారని వెల్లడించారు. 

ఆన్‌లైన్‌లో ఎల్లమ్మ కల్యాణ సేవలు
హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం ఆన్‌లైన్‌ సేవలను కూడా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రారంభించారు. జూలై 5న ఎల్లమ్మ కల్యాణం నిర్వహించనున్నారని, జూలై 4 లోగా భక్తులు ఆన్‌లైన్‌లో కల్యాణం సేవలను బుక్‌ చేసుకోవాలని తెలిపారు. అమ్మవారి కల్యాణానికి సంబంధించి ఆన్‌లైన్‌ సేవలు బుక్‌ చేసుకున్న భక్తుల గోత్రనామాలతో పూజలు చేసి, పసుపు కుంకుమ, డ్రై పూట్స్‌ ఇంటికి పంపిస్తారని చెప్పారు. మీ సేవ, ఆలయ వెబ్‌ సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ కల్యాణ సేవలకు రూ. 500 చెల్లించాల్సి ఉంటుందన్నారు.  

మరిన్ని వార్తలు