వారంలోగా విద్యుత్‌ ఉద్యోగులకు పీఆర్సీ 

26 Feb, 2023 02:43 IST|Sakshi
మంత్రి జగదీశ్‌రెడ్డికి వినతిపత్రం  అందజేస్తున్న విద్యుత్‌ జేఏసీ నేతలు  

మంత్రి జగదీశ్‌రెడ్డి హామీ  

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌తో మాట్లాడి వారంరోజుల్లో విద్యుత్‌ ఉద్యోగులకు వేతన సవరణపై ప్రకటన చేస్తామని విద్యుత్‌ శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి హామీ ఇచ్చారు. విద్యుత్‌ ఉద్యోగ సంఘాలన్నీ కలిసి సోమవారం ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీతో చర్చించి ఓ ఫిట్‌మెంట్‌ శాతాన్ని నిర్ణయించుకోవాలని సూచించారు. అనంతరం ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు సమర్పించే నివేదికపై సీఎం కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.

తెలంగాణ విద్యుత్‌ జేఏసీ నేతలు శనివారం జగదీశ్‌రెడ్డిని మింట్‌ కాంపౌండ్‌లోని ఆయన కార్యాలయంలో కలిసి పీఆర్సీ ప్రకటించాలని వినతిపత్రం అందజేశారు. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. విద్యుత్‌ వేతన సవరణ సంప్రదింపుల కమిటీ విద్యుత్‌ ఉద్యోగులకు 5 శాతం, ఆర్టిజన్లకు 10 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు చేయాలని సిఫారసు చేయగా, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు జేఏసీ నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంచి ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక జాప్యం చేయకుండా వారంలో పీఆర్సీ ప్రకటిస్తామని, ఆందోళనలు విరమించుకోవాలని జగదీశ్‌రెడ్డి వారికి సూచించారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్‌ కె.ప్రకాశ్, కన్వీనర్‌ శివాజీ, వైస్‌చైర్మన్‌ అంజయ్య, జేఏసీ నేతలు నాసర్‌ షరీఫ్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు