ఆసుపత్రిలో కరెంట్‌ లేకపోతే ఎట్లా?

7 Jan, 2023 04:10 IST|Sakshi

గోల్కొండ (హైదరాబాద్‌): ‘ఆసుపత్రి­లో ఇన్నాళ్లు కరెంటు లేకపోతే మీరు ఏం చేస్తున్నారు’ అని కేంద్రమంత్రి కిషన్‌­రెడ్డి ఓ ప్రాథమిక ఆరోగ్య (పీహెచ్‌సీ) కేంద్రం మెడికల్‌ ఆఫీసర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన గుడిమల్కాపూర్‌ ఉషోదయ కాలనీలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన దాదాపు మూడు నెలలుగా ఆసుపత్రిలో కరెంటు లేకపోవడంపై ఆసుపత్రి మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కవితపై మండిపడ్డారు.

బాధ్యతగల ప్రభుత్వ అధికారిగా ఉంటూ ఇన్నాళ్లూ ఆసుపత్రిలో కరెంటు లేకపోయినా పట్టించుకోకపోవడం తగదని అన్నారు. పేద ప్రజలు ఎక్కువగా వచ్చే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సౌకర్యాలు ఇలా ఉంటే ఎట్లా? అని మండిపడ్డాడు. రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఆసుపత్రుల కోసం ప్రత్యేక నిధులు వస్తాయని, కరెంటు పునరుద్ధరణ గురించి ఉన్నతాధికారులను ఎందుకు అడగలేకపో­యారని ప్రశ్నించారు. స్థానిక ప్రజాప్రతినిధి సలహాలు, సూచనలు తీసుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారని ఆయన డాక్టర్‌ కవితను నిలదీశారు.

అనంతరం కార్వాన్‌ క్లస్టర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అనురాధతో ఫోన్లో మాట్లాడి ఉషోదయకాలనీలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కరెంటు లేకపోవడంపై నిలదీశారు. పీహెచ్‌సీలను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన మీరు ఎందుకు నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యాధికారుల పనితీరు ఇలా ఉంటే  ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు ఎలా అందిస్తారని ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. వెంటనే ఉషోదయకాలనీ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కరెంటు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కిషన్‌రెడ్డి ఆదేశించారు.

కాగా, మూడు నెలలకిందట ఈ పీహెచ్‌సీలో షార్ట్‌సర్క్యూట్‌తో కరెంటువైర్లు కాలిపోయాయని, దాంతో అప్పటి నుంచి కరెంటు లేకుండా పోయిందని తెలుస్తోంది. గత కొంతకాలం నుంచి ఈ ఆరోగ్య కేంద్రం పనితీరుపై స్థానికులు అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు కేంద్రమంత్రి ఈ ఆసుపత్రిని సందర్శించడంతో పీహెచ్‌సీ పనితీరు మారుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.    

మరిన్ని వార్తలు