ఇళ్ల నిర్మాణంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం: కిషన్‌రెడ్డి

5 Oct, 2020 11:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన సోమవారం బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌తో కలిసి ముషిరాబాద్‌ నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. పలువురు లబ్ధిదారులు మంత్రిని కలసి ఇళ్ల నిర్మాణంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని లక్షల ఇళ్లు నిర్మించినా.. కేంద్రం వాటాను తీసుకొచ్చే బాధ్యత తమదన్నారు. 2015లో శంకుస్థాపన చేసిన ఇంటి నిర్మాణాలు పూర్తి కాకపోవటం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ చేతకాని తనమని మండిపడ్డారు.

ఎన్నికల‌ కోసం టీఆర్ఎస్ డబుల్ బెడ్రూం ఇళ్లను వాడుకుంటోందని మంత్రి కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇళ్ల కోసం ఇచ్చిన నిధులను పక్కదోవ పట్టించారని తెలిపారు. కేంద్ర నిధులతో ఆంద్రప్రదేశ్‌లో 7లక్షల ఇళ్లు పూర్తి చేశారని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో దాదాపు 20లక్షల మంది పేదలకు ఇళ్లు లేవన్నారు. అందరికీ ఇళ్లు నిర్మిస్తే కేంద్ర ప్రభుత్వం వాటా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు మౌలిక సదుపాయాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.

అదే విధంగా బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. ముషీరాబాద్ నియోజకవర్గంలో వెయ్యి డబుల్ బెడ్రూం ఇళ్లు కడతామని చెప్పి ప్రభుత్వం మాట తప్పిందని మండిపడ్డారు. నియోజకవర్గంలో 431 ఇళ్లు మాత్రమే నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్లను ఆశగా చూపి మూడు ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓట్లు వేయించుకుందని విమర్శించారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా