సఫాయి అన్న.. నీకు సలాం అన్న

14 Dec, 2021 08:42 IST|Sakshi
జెండా ఊపి స్వచ్ఛ ఆటో టిప్పర్‌ను ప్రారంభిస్తున్న మంత్రులు కే టీఆర్, మహమూద్‌ అలీ, తలసాని, మేయర్‌ విజయలక్ష్మి

సాక్షి, సనత్‌నగర్‌(హైదరాబాద్‌): సఫాయి అన్న.. నీకు సలాం అన్న.. అంటూ వారి సేవలను గుర్తించి మూడుసార్లు వేతనాలు పెంచిన మొదటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మాత్రమేనని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ అన్నారు.  డ్రైవర్స్‌ కమ్‌ ఓనర్‌ స్కీం కింద సనత్‌నగర్‌ లేబర్‌ వెల్ఫేర్‌ సెంటర్‌ కేంద్రంగా నగర వ్యాప్తంగా 1,350 స్వచ్ఛ ఆటో టిప్పర్లను సోమవారం మంత్రులు ప్రారంభించారు.

వీరిలో మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలత శోభన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌లతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం 250 మంది లబ్ధిదారులకు స్వచ్ఛ ఆటోలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ..  

బెస్ట్‌ సిటీగా హైదరాబాద్‌.. 

 గతంలో 2015లో స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా 2,500 స్వచ్ఛ ఆటో టిప్పర్లను ఏకకాలంలో తీసుకువచ్చామని గుర్తుచేశారు. దేశంలో స్వచ్ఛభారత్, స్వచ్ఛ సర్వేక్షణ్‌ అమలుపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్‌ బెస్ట్‌ సిటీగా నిలిచిందన్నారు.  

► ఎప్పటికప్పుడు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తెల్లవారుజామున 3– 4 గంటల నుంచే పరిశ్రమిస్తున్న మున్సిపల్‌ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు, స్వచ్ఛ ఆటోడ్రైవర్లకు, ఇతర వాహనాల సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. స్వచ్ఛ ఆటో టిప్పర్లను ప్రవేశపెట్టకముందు నగరం నుంచి ప్రతిరోజూ 3,500 మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తి అయ్యేదన్నారు. వీటిని ప్రవేశపెట్టిన తర్వాత 6,500 మెట్రిక్‌ టన్నుల చెత్త సేకరణ జరుగుతోందన్నారు.   

దక్షిణ భారతంలోనే అతిపెద్ద ప్లాంట్‌.. 

 వాహనాల ద్వారా సేకరించిన చెత్తను తడి, పొడి చెత్తను వేరు చేసి విద్యుత్పాదనకు జవహర్‌నగర్‌లో 20 మెగావాట్ల ప్లాంట్‌ను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. మరో 28 మెగావాట్ల ప్లాంట్‌కు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నుంచి అనుమతులు వచ్చాయన్నారు. దాని పనులు కూడా ప్రారంభమై పూర్తి చేసుకుంటే మొత్తం 48 మెగావాట్లతో దక్షిణ భారతంలోనే అతిపెద్ద ప్లాంట్‌గా నగరం నిలవనున్నదన్నారు.

కార్పొరేటర్లు, అధికారులు తమ పరిధిలో క్షేత్ర స్థాయిలో పర్యటించి మెరుగైన పారిశుద్ధ్యం కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ సంతోష్, ప్రియాంక అలా, జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్, జాయింట్‌ కమిషనర్‌ సంధ్య, కార్పొరేటర్లు కొలను లక్ష్మీబాల్‌రెడ్డి, మహేశ్వరి శ్రీహరి, డీఎంసీ వంశీకృష్ణ, ఏఎంహెచ్‌ఓ భార్గవ నారాయణ్, మహీంద్రా  కంపెనీ ఉద్యోగులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు