అందరినీ ఆదుకుంటాం

19 Aug, 2020 01:53 IST|Sakshi
మంగళవారం హన్మకొండ హంటర్‌రోడ్డులో రహదారిపై వరద నీటిలో నడుస్తూ పరిశీలిస్తున్న  మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు

వరంగల్‌ వరద బాధితులకు మంత్రి కేటీఆర్‌ భరోసా

మంత్రులు ఈటల, ఎర్రబెల్లి, సత్యవతితో ముంపు కాలనీల్లో పర్యటన

సమస్యలు వింటూ, హామీలిస్తూ ముందుకు.. ఎంజీఎం కోవిడ్‌ వార్డు పరిశీలన

నిట్‌లో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్ష

నాలాల ఆక్రమణ, అక్రమ నిర్మాణాలపై కేటీఆర్‌ సీరియస్‌.. తొలగించాలని ఆదేశం..

నాలాల అభివృద్ధి, పునరుద్ధరణకు రూ. 25 కోట్లు మంజూరు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ‘వరంగల్‌ నగరంలో వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుంటుంది. నగరంలో సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులకు ఆదేశించాం. సీఎంకు పరిస్థితి వివరించడంతో రూ.25 కోట్లు తక్షణ సహాయం కింద మంజూరు చేశారు. అందరూ ధైర్యంగా ఉండాలి’అని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారక రామారావు భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ తదితరులు ముంపునకు గురైన వరంగల్‌ నగరంలో మంగళవారం పర్యటించారు. కేటీఆర్, ఈటల ఉదయం హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు హెలికాప్టర్‌లో చేరుకున్నారు.

అనంతరం కేటీఆర్‌ నాయకత్వంలో మంత్రులు, ఉన్నతాధికారులు వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలోని నయీంనగర్, సమ్మయ్య నగర్, గోపాలపూర్, పెద్దమ్మగడ్డ–యూనివర్సిటీ రోడ్, పోతననగర్, బొందివాగు రోడ్, రామన్నపేట, హంటర్‌ రోడ్, సంతోషిమాత గుడి ప్రాంతం, ఉర్సు, రంగశాయిపేట, శివనగర్‌ తదితర ప్రాంతాల్లో దాదాపు 4 గంటల పాటు పర్యటించారు. అన్ని ప్రాంతాల్లోని ముంపునకు గురైన ప్రజలతో మాట్లాడి వారి సాధక బాధకాలు తెలుసుకున్నారు. దెబ్బతిన్న డ్రైనేజీలు, ఇళ్లు, రోడ్లను పరిశీలించారు. ఫాతిమానగర్‌–కేయూ వంద ఫీట్ల రోడ్డులో గోపాలపూర్, సమ్మయ్య నగర్‌ ప్రాంత వాసులతో కేటీఆర్‌ మాట్లాడారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని.. పరిస్థితి చక్కబడే వరకు నిత్యావసర సరుకులు అందజేస్తామని హామీ ఇచ్చారు. హంటర్‌ రోడ్డులో కేటీఆర్‌ సహా ఇతర ప్రజాప్రతినిధులు వరద నీటిలోనే నడుస్తూ పరిస్థితులు పరిశీలించారు. చాలా చోట్ల నాలాలపై ఆక్రమణ వల్లే వరదలు సంభవించినట్లు స్థానికులు కేటీఆర్‌ దృష్టికి తెచ్చారు. సహాయక చర్యల్లో పాల్గొన్న డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ సభ్యులను కేటీఆర్‌ ప్రత్యేకంగా అభినందించారు. 

మంగళవారం వరంగల్‌ జిల్లా హన్మకొండ అమరావతినగర్‌ వాసులతో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌. 
చిత్రంలో ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు

వరంగల్‌ ఎంజీఎం కోవిడ్‌ వార్డు సందర్శన.. 
ముంపు ప్రాంతాల పర్యటన అనంతరం ఈ బృందం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలోని కోవిడ్‌ వార్డును సందర్శించింది. మంత్రులు కేటీఆర్, ఈటల, ఎర్రబెల్లి పీపీఈ కిట్లు ధరించి కోవిడ్‌ వార్డులోకి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వైద్యంపై ఆరా తీశారు. మందులు, పరికరాలతోపాటు నిపుణులైన వైద్యులు, ఇతర సిబ్బంది అంతా సిద్ధంగా ఉన్నారని, ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని వారికి ధైర్యం చెప్పారు. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులను, ఆరోగ్య సిబ్బందిని అభినందించారు.
 
ఆక్రమణలపై సీరియస్‌.. 
ఏరియల్‌ వ్యూ ద్వారా ఓరుగల్లు నగరాన్ని పరిశీలించిన కేటీఆర్‌.. అనంతరం కాజీపేటలోని ‘నిట్‌’ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్, అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మా ట్లాడుతూ.. ‘ముంపు కాలనీల పర్యటనలో దాదాపు అన్ని ప్రాంతాల ప్రజలు ఒకే విష యం చెప్పారు. నాలాలపై ఆక్రమణల వల్ల వ రద బయటకు వెళ్లపోవడంతో రోడ్లపైకి నీరు వచ్చి జనావాసాలు జలమయమయ్యాయన్నారు. వారు చెప్పింది నిజం. నగరంలో అనే క చోట్ల నాలాలపై ఆక్రమణలున్నాయి. వాటి ని తక్షణం తొలగించాలి. రాజకీయ ఒత్తిళ్లు ఉండవు. ఇప్పటికే గుర్తించిన నిర్మాణాల తొలగింపు పని వెంటనే ప్రారంభం కావాలి. ఆక్రమణల గుర్తింపు, తొలగింపునకు కలెక్టర్‌ చైర్మన్‌గా జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ కమిటీని నియమిస్తున్నాం. నాలాలపై అక్రమ నిర్మాణాలు వేటిని విడిచిపెట్టొద్దు. ఒకవేళ వాటిల్లో పేదల ఇళ్లుంటే, వారికి ప్రభుత్వం తరఫున డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని హామీ ఇవ్వాలి. రిజిస్ట్రేషన్‌ ఉన్న వారివైతే నష్ట పరిహారం చెల్లించి తొలగించాలి’అని ఆదేశించారు. ( రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకు కరోనా  )

పీపీఈ కిట్లు ధరించి వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలోని కోవిడ్‌ వార్డులో 
చికిత్స పొందుతున్న వారితో మాట్లాడుతున్న మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్
‌ 
కలెక్టర్‌ ఆధ్వర్యంలో స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ 
వరంగల్‌లో రాబోయే నెల పాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి నాలాలపై ఉన్న ఆక్రమణలు తొలగిస్తామని కేటీఆర్‌ ప్రకటించారు. నాలాలపై ఉన్న ఆక్రమణలు గుర్తించి, వాటిని తొలగించే కార్యక్రమం నిర్వహించడానికి వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ నేతృత్వంలో కమిటీని నియమించారు. కలెక్టర్‌ రాజీవ్‌ హన్మంతు చైర్మన్‌గా, పోలీస్‌ కమిషనర్‌ కో చైర్మన్‌గా, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్, జల వనరుల శాఖ ఎస్‌ఈ, వరంగల్‌ అర్బన్‌ ఆర్డీఓ, నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఎస్‌ఈ సభ్యులుగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ కమిటీని నియమిస్తూ మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

జరిగిన నష్టంపై అధికారులు అంచనాలు రూపొందించిన తర్వాత అవసరమైనన్ని నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు. వరంగల్‌లో నాలాలపై ఆక్రమణలు ఇప్పుడు వచ్చినవి కాదని.. చాలా ఏళ్ల క్రితం నుంచే ఇదంతా జరిగిందన్నారు. ఓ పద్ధతి ప్రకారం నగరాభివృద్ధి జరగాలనే ఉద్దేశంతోనే కొత్త మున్సిపల్‌ చట్టం తెచ్చామని చెప్పారు. వరంగల్‌ నగరానికి కొత్త మాస్టర్‌ ప్లాన్‌ కూడా సిద్ధమైందని, సీఎం ఆమోదంతో త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ‘ఈ రెండింటితో పాటు కొత్తగా టీఎస్‌ బీ పాస్‌ కూడా వచ్చింది. ఈ చట్టాలు, విధానాలు, ప్రణాళికలకు అనుగుణంగా వరంగల్‌లో ఇకపై నిర్మాణాలుండాలి. ఆ మేరకు అభివృద్ధి కావాలి’అని కేటీఆర్‌ వివరించారు. 

వరంగల్‌పై ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రేమ 
వరంగల్‌ నగరంపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక శ్రద్ధ, ప్రేమ ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ‘వరంగల్‌లో భారీ వర్షాలు, వరదలు అనే సమాచారం సీఎంకు ఎంతో ఆందోళన కలిగించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఏ మాత్రం ప్రాణనష్టం కలగకుండా సహాయ చర్యలు ముమ్మరం చేయాలని మార్గనిర్దేశం చేశారు. సీఎం సోమవారం స్వయంగా వరంగల్‌ రావాలనుకున్నారు. కానీ సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతోనే మానుకున్నారు. మమ్మల్ని ప్రత్యేకంగా పంపించారు. ఇక్కడి పరిస్థితిని చూసి, సీఎంకు నివేదించాం. తక్షణ అవసరాల కోసం రూ.25 కోట్లు మంజూరు చేసిన సీఎం.. నష్టంపై అధికారులు పూర్తి స్థాయి అంచనాలు రూపొందించిన తర్వాత ఎన్ని నిధులు కావాలన్నా ఇస్తామని చెప్పారు’అని కేటీఆర్‌ పేర్కొన్నారు. వరంగల్‌ నగర జనాభా ఇప్పటికే 11 లక్షలకు చేరిందని, దీనికి అనుగుణంగా సిబ్బందిని పెంచుకోవాలని అభిప్రాయపడ్డారు.

‘పారిశుద్ధ్య పనుల్లో యాంత్రీకరణ జరగాలి. ముంపునకు గురైన వారికి ప్రభుత్వం పక్షానే నిత్యావసర సరుకులు అందించాలి. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు భాగస్వాములు కావాలి. అలాగే రాబోయే రోజుల్లో మళ్లీ భారీ వర్ష సూచన ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి’అని కేటీఆర్‌ సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీలు బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముర్తుజా రిజ్వీ, డీహెచ్‌ఈ రమేశ్‌ రెడ్డి, నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, కలెక్టర్‌ రాజీవ్‌ హన్మంతు, పోలీస్‌ కమిషనర్‌ ప్రమోద్‌ కుమార్, మున్సిపల్‌ కమిషనర్‌ పమేలా సత్పతి, కుడా చైర్‌ పర్సన్‌ మర్రి యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు