KTR: రాష్ట్రాన్ని విజ్ఞాన కేంద్రంగా నిలపడమే లక్ష్యం: కేటీఆర్‌ 

25 Feb, 2023 04:12 IST|Sakshi

ఇప్పటికే అంచనాలకు మించి వృద్ధి సాధిస్తున్నాం 

2030 నాటికి 250 బిలియన్‌ డాలర్ల పరిశ్రమగా హైదరాబాద్‌ లైఫ్‌ సైన్సెస్‌ 

నాలుగు మూలస్తంభాల సాయంతో ఈ రంగానికి కొత్తరూపు 

బీ హబ్, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యూరేటివ్‌ మెడిసిన్‌ ఏర్పాటు చేస్తాం 

హైదరాబాద్‌ను ‘హెల్త్‌ టెక్‌ మక్కా’గా మార్చేందుకు స్టార్టప్‌లకు ఊతం 

అత్యుత్తమ మౌలిక వసతులు, నైపుణ్యమున్న మానవ వనరులే బలం 

నగరం నుంచి కొన్ని ‘గ్లోబల్‌ హెల్త్‌–టెక్‌ యూనికార్న్‌’లు ఉద్భవిస్తాయని ఆశాభావం 

‘బయో ఆసియా–2023’ సదస్సును ప్రారంభించిన మంత్రి 

కొన్నేళ్లుగా పెరిగిన వైద్యపరమైన ఆవిష్కరణలు: నోవారి్టస్‌ సీఈవో వాస్‌ నరసింహన్‌ 

 కణ, జన్యు చికిత్స వంటి కొత్త విధానాలు వస్తున్నాయి 

మెదడుకు సంబంధించిన చికిత్సలపై దృష్టి సారించాల్సి ఉంది 

హైదరాబాద్‌ ప్రపంచ ఆరోగ్య రక్షణ రంగానికి కేంద్రంగా మారింది 

ఔషధ అభివృద్ధి, డేటా నిర్వహణ తదితరాల్లో వేగంగా వృద్ధిచెందుతోందని ప్రశంస

జీవశాస్త్ర సేవల్లో వృద్ధి సాధించడం ద్వారా ప్రపంచ లైఫ్‌ సైన్సెస్‌ రంగానికి తెలంగాణను విజ్ఞాన కేంద్రంగా మార్చడమే తమ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ప్రపంచ లైఫ్‌ సైన్సెస్‌ రంగానికి గమ్యస్థానంగా హైదరాబాద్‌ ఇప్పటికే పేరు గడించినా.. ఇక్కడితోనే ఆగిపోవాలని తాము కోరుకోవడం లేదని పేర్కొన్నారు. ఆసియాలోనే అతిపెద్ద లైఫ్‌ సైన్సెస్, ఆరోగ్య రక్షణ సదస్సు ‘బయో ఆసియా–2023’ శుక్రవారం హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ)లో ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సును మంత్రి కేటీఆర్‌ ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ రంగాలకు చెందిన దిగ్గజాలతో కలిసి ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు.  ఆ వివరాలు కేటీఆర్‌ మాటల్లోనే..

‘‘రాష్ట్రంలో లైఫ్‌ సైన్సెస్‌ పరిశ్రమ విలువ 2030 నాటికి 250 బిలియన్‌ డాలర్లను దాటుతుందని అంచనా వేస్తున్నాం. మేం విధించుకున్న సాహసోపేత లక్ష్యాన్ని సాధించేందుకు నాలుగు అంశాలను మూల స్తంభాలుగా ఎంచుకున్నాం. వాటి సాయంతో లైఫ్‌ సైన్సెస్‌ రంగానికి కొత్త రూపు ఇస్తాం. పరిశోధన, అభివృద్ధికి గమ్యస్థానంగా.. భారత ఫార్మా ఉత్పత్తుల్లో 40 శాతం వాటా కలిగిన హైదరాబాద్‌లో ఉన్న వెయ్యికి పైగా లైఫ్‌సైన్సెస్‌ కంపెనీలు వినూత్న, జెనరిక్‌ ఔషధాలను ఉత్పత్తి చేస్తున్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్, బయోలాజికల్‌–ఈ, భారత్‌ బయోటెక్, శాంతా బయోటెక్, అరబిందో, హెటెరో, గ్లాండ్‌ ఫార్మా, విర్చో బయోటెక్‌ వంటి కీలక సంస్థలు ఇక్కడ ఉండటంతో.. జీవ ఔషధాల ఉత్పత్తిలో దేశంలోనే హైదరాబాద్‌ అగ్రగామిగా ఉంది. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటయ్యే బయో ఫార్మాహబ్‌ (బీ హబ్‌), హైదరాబాద్‌ ఫార్మాసిటీలతో మా సామర్థ్యం మరింత బలోపేతమవుతుంది. కణ, జన్యు చికిత్సల రంగంలో పెట్టుబడులు పెట్టడంతోపాటు కొత్త తరహా నివారణ, చికిత్సల వాణిజ్యీకరణ లక్ష్యంతో హైదరాబాద్‌లో ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యూరేటివ్‌ మెడిసిన్‌’ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. 

అన్ని వసతులు, వనరులతో.. 
ఆసియాలో ఔషధ ఆవిష్కరణ, అభివృద్ధి సేవలకు హైదరాబాద్‌ను కేంద్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో.. లైఫ్‌ సైన్సెస్‌ రంగం అభివృద్ధికి అవసరమైన అన్ని మౌలిక వసతులు జీనోమ్‌ వ్యాలీలో అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ విద్యా, పరిశోధన సంస్థలతోపాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ఔషధ రసాయన శాస్త్రం, డిస్కవరీ బయాలజీ, ప్రీ–క్లినికల్, క్లినికల్, డ్రగ్‌ డెవలప్‌మెంట్, క్లినికల్‌ ట్రయల్‌ ప్రొడక్ట్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ సహా వివిధ సేవలు అందించే భారతీయ, బహుళజాతి ఫార్మాస్యూటికల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌లకు హైదరాబాద్‌ నిలయంగా ఉంది. 
అంచనాలకు మించి వృద్ధి సాధించాం.. 
లైఫ్‌ సైన్సెస్, ఫార్మా, సంపూర్ణ ఆరోగ్య రక్షణ ప్రాముఖ్యతను గుర్తించడంలో తెలంగాణ ముందు వరుసలో ఉంది. 2030 నాటికి హైదరాబాద్‌ లైఫ్‌ సైన్సెస్‌ రంగం విలువ వంద బిలియన్‌ డాలర్లకు చేరుతుందని గతంలో మేం వేసుకున్న అంచనాలు చాలా మందికి నమ్మశక్యంగా కనిపించలేదు. కానీ 2022 నాటికే 80 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాం. నిర్దేశిత షెడ్యూల్‌ కంటే ఐదేళ్లు ముందు 2025 నాటికే వంద బిలియన్‌ డాలర్ల లక్ష్యాన్ని చేరుకుంటాం. లైఫ్‌ సైన్సెస్‌ రంగం వృద్ధి జాతీయ స్థాయిలో 14శాతంకాగా.. తెలంగాణలో 23 శాతంగా ఉంది. ఏడేళ్లలో కొత్తగా 3 బిలియన్‌ డాలర్లకుపైగా నికర పెట్టుబడులు ఆకర్షించడంతోపాటు 4.5 లక్షల ఉద్యోగాలు సృష్టించాం. బయో ఆసియా 20వ వార్షిక సదస్సు కొత్త అవకాశాలకు బాటలు వేస్తుందని ఆశిస్తున్నాం..’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

ఘనంగా ‘బయో ఆసియా’ సదస్సు ప్రారంభం 
ఆసియాలోనే అతిపెద్ద లైఫ్‌ సైన్సెస్, ఆరోగ్యరక్షణ సదస్సు ‘బయో ఆసియా–2023’ శుక్రవారం హెచ్‌ఐసీసీలో ఘనంగా ప్రారంభమైంది. ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో తొలిరోజు ప్రభుత్వ అధికారులు, బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌లు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన నిపుణులు పాల్గొన్నారు. ‘అడ్వాన్సింగ్‌ ఫర్‌ ఒన్‌: షేపింగ్‌ నెక్ట్స్‌ జనరేషన్‌ ఆఫ్‌ హ్యూమనైజ్డ్‌ హెల్త్‌కేర్‌’ నేపథ్యం (థీమ్‌)తో ఈ వార్షిక సదస్సును నిర్వహిస్తున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. ప్రారంభ కార్యక్రమంలో నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్, నోవారి్టస్‌ సీఈవో వాస్‌ నరసింహన్, రెడ్డీస్‌ ల్యాబ్స్‌ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శక్తి నాగప్పన్, జయంత్‌ నాడిగర్, సమిత్‌ హెరావత్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో లైఫ్‌ సైన్సెస్‌ రంగాన్ని పునర్‌ నిర్మించాలనే ఉద్దేశంతో భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంటున్నాం. లైఫ్‌ సైన్సెస్‌ పరిశ్రమ విలువ 2030 నాటికి 250 బిలియన్‌ డాలర్లను దాటుతుందని అంచనా వేస్తున్నాం. ఈ సాహసోపేత లక్ష్యాన్ని సాధించేందుకు నాలుగు అంశాలను మూల స్తంభాలుగా ఎంచుకున్నాం. 1. సెల్, జీన్‌ థెరపీ వంటి కొత్త నివారణ చికిత్సల వాణిజ్యీకరణ, 2. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలు, 3.లైఫ్‌ సైన్సెస్‌ ఫోకస్డ్‌ గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్లకు హైదరాబాద్‌ను గమ్యస్థానంగా మార్చడం, 4.ఆరోగ్య సంరక్షణ సాంకేతికతల కలబోత సాధించడం. ఈ నాలుగింటి సాయంతో లైఫ్‌ సైన్సెస్‌ రంగానికి కొత్త రూపు ఇస్తాం.  -కేటీఆర్, తెలంగాణ ఐటీశాఖ మంత్రి

గుండె వ్యాధులకూ వ్యాక్సిన్‌ చికిత్సలు: నోవార‍్టీస్ సీఈవో డాక్టర్‌ వాస్‌ నరసింహన్‌
 

మానవ మేధస్సును సాంకేతికత భర్తీ చేయలేదని, కానీ మనుషులు మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు సాంకేతికత అవసరమని ప్రముఖ ఫార్మా సంస్థ నోవార‍్టీస్ సీఈవో డాక్టర్‌ వాస్‌ నరసింహన్‌ చెప్పారు. మానవ శరీర నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవడంతోపాటు ఆరోగ్య సమస్యలు, వాటి పరిష్కారంపై లోతుగా ఆలోచించాలని శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. ‘బయో ఆసియా’ సదస్సులో వాస్‌ నరసింహన్‌ కీలకోపన్యాసం చేశారు. ‘‘డేటా సైన్సెస్, కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా ఆరోగ్యపరమైన అన్ని సమస్యలకు పరిష్కారం చూపేందుకు సరిపడినంత సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదు. గత దశాబ్దకాలంగా అనేక వైద్య, చికిత్సాపరమైన ఆవిష్కరణలు జరుగుతున్నాయి. కణ, జన్యు చికిత్స వంటి కొత్త విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి వృద్ధుల్లో ఎక్కువ మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారు. 80వ దశకంలో పురుడు పోసుకున్న ఎస్‌ఐ ఆర్‌ఎన్‌ఏ సాంకేతికత ద్వారా గుండె సంబంధ వ్యాధులను ఎదుర్కోవచ్చు. ఎస్‌ఐ ఆర్‌ఎన్‌ఏ ఉపయోగించడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులకు కూడా వ్యాక్సిన్‌ ఆధారిత చికిత్స ఎంతో దూరంలో లేదు. గుండె వ్యాధుల తర్వాత ప్రపంచంలో ఎక్కువ మంది కేన్సర్‌ బారిన పడుతున్నారు. ఎన్నో రకాల చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ‘రేడియోలిగాండ్‌’ అనే కొత్త విధానంలో పెట్‌ స్కాన్‌ ద్వారా కేన్సర్‌ కణితులను గుర్తించి రేడియేషన్‌ చికిత్స అందించవచ్చు..’’ అని వాస్‌ నరసింహన్‌ చెప్పారు.

ఈ రెండింటి తర్వాత ప్రపంచంలో ఎక్కువ మంది నరాల సంబంధిత వ్యాధులతో ప్రాణాలు కోల్పోవడం లేదా అంగవైకల్యానికి గురి కావడం జరుగుతోందని.. బహుళ సాంకేతికతల వినియోగం ద్వారా మెదడులోని వివిధ భాగాలకు చికిత్స అందించడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలో సికిల్‌ సెల్‌ వ్యాధితో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అధికంగా ఉందని.. అవసరమైనంత మేర ఔషధాలు అందుబాటులో లేవని చెప్పారు. హైదరాబాద్‌లో కెపాసిటీ సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు 15 ఏళ్ల క్రితం నోవార‍్టిస్‌ సంస్థ హైదరాబాద్‌లో అడుగు పెట్టిందని.. శరవేగంగా వృద్ధి చెంది ప్రస్తుతం కార్పోరేట్‌ సెంటర్‌గా ఎదిగిందని వాస్‌ నరసింహన్‌ చెప్పారు. ప్రపంచ ఆరోగ్య రక్షణ రంగానికి హైదరాబాద్‌ కేంద్రంగా మారిందని.. ఔషధ అభివృద్ధి, డేటా నిర్వహణ తదితర అంశాల్లో వేగంగా వృద్ధి చెందుతోందని వివరించారు. లైఫ్‌ సైన్సెస్‌ రంగానికి చెందిన దిగ్గజ సంస్థలు పెట్టుబడులతో హైదరాబాద్‌కు రావాలని పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తలు