నిరుద్యోగులకు ప్రైవేటు కొలువులిప్పిస్తున్నాం

23 Jul, 2022 02:39 IST|Sakshi
సిరిసిల్లలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌ 

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు 8 లక్షలే.. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్‌  

సిరిసిల్ల: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు 8 లక్షలే నని, అందువల్ల నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగావకాశాలు కలిస్తున్నామని మంత్రి కె.తారక రామారావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం బీసీ స్టడీ సర్కిల్‌ను కేటీఆర్‌ సందర్శించి కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. జిల్లా ఆస్పత్రిలో పిల్లల వార్డును ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లా డుతూ.. రాష్ట్రంలో తమ తొలి విడత ఐదేళ్ల పాలనలో 1.32లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని, ప్రస్తుత రెండో దఫా పాలనలో 81 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినట్లు చెప్పారు. దేశంలో ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో 35 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే.. ప్రధాని మోదీ కేవలం 10 లక్షల పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించారని ఆరోపించారు.

ప్రభుత్వ ఉద్యోగార్థులందరూ సెల్‌ఫోన్‌ పక్కనపెట్టి అంకితభావంతో చదివితే రాష్ట్ర, కేంద్ర ఉద్యోగాలు చేజిక్కించుకోవచ్చన్నారు. రాష్ట్రంలో మరో 134 స్టడీసర్కిళ్లను సీఎం మంజూరు చేసినట్లు కేటీఆర్‌ గుర్తుచేశారు. ప్రతిభ ప్రాతిపదికనే ఉద్యోగాల భర్తీ ఉంటుందన్నారు. అభ్యర్థులు అవకాశాలను సద్విని యోగం చేసుకోవాలని సూచించారు.

తెలంగాణ చోదకశక్తిగా ఎదిగింది..
తెలంగాణ తలసరి ఆదాయం, జీఎస్‌డీపీ రెట్టింపు అయిందని.. దేశాన్ని సాదుతున్న రాష్ట్రంగా, ఆర్థిక చోదకశక్తిగా ఎదుగుతోందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ వచ్చిన కొత్తలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1.24 లక్షలుగా ఉంటే.. ఇప్పుడు రూ.2.78 లక్షలకు చేరిందన్నారు. ఇవి ఆర్‌బీఐ చెప్పిన లెక్కలని స్పష్టం చేశారు. ఎనిమిదేళ్లలో దేశానికి ట్యాక్సుల రూపంలో రూ.3,65,797 కోట్లు రాష్ట్రం నుంచి ఇచ్చామన్నారు. కేంద్రం నుంచి రూ.1,68,000 కోట్లు తిరిగి తెలంగాణకు వచ్చాయని పేర్కొన్నారు.

అయితే రాష్ట్రానికి అన్ని విధాలా అండగా ఉండాల్సిన కేంద్రం అడుగడుగునా వివక్ష చూపతోందని కేటీఆర్‌ ఆరోపించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రతి ప్రజాస్వామ్య వేదికపై గలమెత్తుతామన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ రాహుల్‌ హెగ్డే, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు