బల్క్‌డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటులో రాష్ట్రంపై వివక్ష

3 Sep, 2022 00:45 IST|Sakshi

కేంద్రం వైఖరిని నిరసిస్తూ కేంద్రమంత్రి మాండవీయకు కేటీఆర్‌ లేఖ 

హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, ఏపీ సరసన తెలంగాణకు చోటు దక్కలేదని అసంతృప్తి 

రెండు వేల ఎకరాలు కేటాయిస్తామని లేఖ రాసినా పట్టించుకోలేదని విమర్శ 

సాక్షి, హైదరాబాద్‌: బల్క్‌డ్రగ్‌ పార్కు ఏర్పాటులో తెలంగాణలోని హైదరాబాద్‌ ఫార్మాసిటీని కనీసం పరిగణనలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన బల్క్‌డ్రగ్‌ పార్క్‌ స్కీమ్‌లో తెలంగాణకు చోటు దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్సుక్‌ మాండవీయకు శుక్రవారం లేఖ రాశారు.

బల్క్‌డ్రగ్‌ పార్క్‌ల ఏర్పాటుకు హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, ఏపీ సరసన తెలంగాణకు చోటు దక్కకపోవడాన్ని ప్రశ్నించారు. దేశంలో లైఫ్‌ సైన్సెస్, ఫార్మా రంగానికి వెన్నెముకగా నిలుస్తూ, ప్రపంచ వ్యాక్సిన్ల రాజధానిగా పేరొందిన హైదరాబాద్‌ను కేంద్రం ఉద్దేశపూర్వకంగా విస్మరించిందని ఆరోపించారు. 70 శాతానికిపైగా ముడి ఫార్మా ఉత్పత్తుల కోసం చైనాపై భారత్‌ ఆధార పడుతున్న నేపథ్యంలో బల్క్‌డ్రగ్‌ తయారీలో దేశీయంగా స్వయం సమృద్ధి సాధించేందుకు బల్క్‌డ్రగ్‌ పార్క్‌ స్కీమ్‌ను కేంద్రం తెరపైకి తెచ్చిందన్నారు.

తెలంగాణకు బల్క్‌డ్రగ్‌ పార్కు కేటాయించాలని, హైదరాబాద్‌ ఫార్మాసిటీలో రెండు వేల ఎకరాల్లో ఈ పార్కు ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రానికి తెలియచేస్తూ ఫార్మాసిటీ మాస్టర్‌ ప్లాన్‌ను కూడా కేంద్రానికి అందజేసిన విషయాన్ని కేటీఆర్‌ గుర్తుచేశారు. భూసేకరణ, పర్యావరణ అనుమతులతోపాటు ఫార్మాసిటీకి ఉన్న సానుకూల అంశాలను వివరిస్తూ కేంద్రానికి సమగ్రమైన నివేదిక ఇచ్చిన విషయాన్ని కేటీఆర్‌ లేఖలో ప్రస్తావించారు. 

కాలయాపన చేసిన కేంద్ర ప్రభుత్వం 
బల్క్‌డ్రగ్‌ పార్కు ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించినా 2021 వరకు కాలయాపన చేసి తాజాగా ప్రకటించిన జాబితాలో తెలంగాణకు చోటు కల్పించకపోవడం శోచనీయమని కేటీఆర్‌ పేర్కొన్నారు. దేశీయ ఫార్మా రంగాన్ని ఆత్మ నిర్భర్‌ వైపు త్వరగా తీసుకువెళ్లాలనే ఉద్దేశం ఉంటే కనీసం రెండు, మూడేళ్లలో పార్కుల అభివృద్ధి పూర్తయ్యే ప్రాంతాలకు బల్క్‌డ్రగ్‌ పార్కును కేటాయించేదని అభిప్రాయపడ్డారు.

దేశ ప్రయోజనాలకు భంగం కలిగించడంతోపాటు బల్క్‌డ్రగ్‌ తయారీ రంగంలో స్వయంసమృద్ధి సాధించాలనే ఆశయానికి మోదీ ప్రభుత్వం గండికొడుతోందని, ఫలితంగా తెలంగాణతోపాటు దేశానికి భారీగా నష్టం జరుగుతుందన్నారు. హైదరాబాద్‌ ఫార్మాసిటీని జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా కేంద్రం ఇదివరకే గుర్తించినా బల్క్‌డ్రగ్‌ పార్కు ఏర్పాటులో విస్మరించడాన్ని కేటీఆర్‌ ప్రశ్నించారు.  

మరిన్ని వార్తలు