‘చేనేత’కు జీఎస్టీ మరణశాసనమే: కేటీఆర్‌ 

8 Aug, 2022 02:20 IST|Sakshi
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతున్న కేటీఆర్‌ 

పీపుల్స్‌ ప్లాజాలో చేనేత ప్రదర్శన 

ఖైరతాబాద్‌(హైదరాబాద్‌): చేనేత ఉత్పత్తుల మీద కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని వెంటనే ఎత్తివేయాలని మంత్రి కె.తారక రామారావు డిమాండ్‌ చేశారు. ఆదివారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ఎమ్మెల్సీ ఎల్‌.రమణ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వీడియో కాన్పరెన్స్‌ ద్వారా మంత్రి మాట్లాడుతూ.. ఈ సంవత్సరం టెస్కో ఆధ్వర్యంలో రామప్ప చేనేత చీరలను ఆవిష్కరించడం గొప్ప శుభపరిణామమన్నారు.

చేనేత మిత్ర ద్వారా 50శాతం సబ్సిడీతో ముడి సరుకు అందిస్తున్నామన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు జాతిపిత మహాత్మాగాంధీ చరకాతో నూలు వడుకుతూ జాతి మొత్తాన్ని స్వదేశీ ఉద్యమంవైపు మళ్లించారని చెప్పారు. కానీ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు నిండిన తరుణంలో భారత ప్రభుత్వం చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించడం దురదృష్టకరమని అన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కొన ఊపిరితో ఉన్న పరిశ్రమపై మరణశాసనం రాసినట్టేనని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం, దేశంలోని చేనేత కార్మికులందరి తరఫున జీఎస్టీని ఎత్తివేయాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. భారతీయ కళలకు చేనేత ఉత్పత్తులు దోహదపడుతున్నాయన్నారు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ ఉద్యోగులు చేనేత వస్త్రాలు ధరించేలా చేస్తున్నామని, ప్రతి సోమవారం ఉద్యోగులు నేత వస్త్రాలను ధరించాలని విజ్ఞప్తి చేశారు.  

మరిన్ని వార్తలు