లాయర్‌ దంపతుల హత్య బాధాకరం: మంత్రి కేటీఆర్‌  

2 Mar, 2021 22:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లాయర్‌ వామన్‌రావు దంపతుల హత్య చాలా బాధాకరమని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ విచారం వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ సమావేశం మంత్రి మాట్లాడుతూ.. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి తమ పార్టీ చెందినవాడేనని తెలిసి తక్షణమే తొలగించిన విషయాన్ని గుర్తుచేశారు. హత్యతో ప్రమేయం ఉన్న వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. శాంతిభద్రతల విషయంలో సీఎం కేసీఆర్‌ కఠినంగా ఉన్నారని, న్యాయవాదుల రక్షణ చట్టం కోసం తప్పకుండా కృషి చేస్తామని హామీనిచ్చారు. 

వామన్‌రావు హత్య కేసును కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. న్యాయవాదుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం రూ.100 కోట్లతో నిధిని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది తెలంగాణ న్యాయవాదులేనని ప్రశంసించారు. బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని అడ్వకేట్ జనరల్‌గా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. హైకోర్టు విభజన కోసం సీఎం కేసీఆర్‌ దాదాపు 10 సార్లు ప్రధాని మోదీని కలిశారని, విభజన జరిగాకే తెలంగాణకు తగిన న్యాయం జరిగిందన్నారు. 

ఆరున్నరేళ్లలో వ్యవసాయమే అబ్బురపడేలా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. టీఆర్‌ఎస్‌ పథకాలను ప్రధాని మోదీ కాపీ కొడుతున్నాడని ఎద్దేవా చేశారు. పేదలు సంతోషంగా ఉండాలనే పెన్షన్లతో సహా ఎన్నో సంక్షేమ పథకాలు ఆమలు చేస్తున్నామన్నారు. కేజీ టూ పీజీ విద్యపై కొందరు అవగాహన లేని వ్యాఖ్యలు చేస్తున్నారని,సంక్షేమ గురుకులాల్లో ఈ పథకం ఇప్పటికే నడుస్తోందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌పై కొందరు అవాక్కులు చవాక్కులు పేలుతున్నారని, అది వారి విజ్ఞతకే వదిలిపెడుతున్నామన్నారు. కనీసం ఆయన వయసుకి గౌరవం ఇవ్వకుండా పరుష పదజాలంతో మాట్లాడటం బాధ కలిగిస్తోందన్నారు. కేసీఆర్ లేకపోతే టీపీసీసీ, టీబీజేపీ లేవని పేర్కొన్నారు. 
చదవండి: 
‘ఎన్డీయే.. నో డేటా అవైలబుల్‌’

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు