-

బాధితులకు ఆర్థిక సాయం

18 Oct, 2020 01:50 IST|Sakshi
గగన్‌పహాడ్‌లో బాధిత కుటుంబానికి చెక్కు అందజేస్తున్న కేటీఆర్‌

వరద బాధితులకు చెక్కులు అందజేసిన మంత్రి కేటీఆర్‌

గగన్‌పహాడ్, ఫీర్జాదిగూడ ప్రాంతాల్లో పర్యటన 

రాజేంద్రనగర్‌/మేడిపల్లి: ముంపు ప్రాంతాలైన గగన్‌పహాడ్, ఫీర్జాదిగూడలో పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ శనివారం పర్యటించారు. అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితులకు భరోసానిచ్చారు. గగన్‌పహాడ్‌లో నీళ్లలోపడి కొట్టుకుపోయి మృతి చెందిన కుటుంబాలను కలిసి ఓదార్చిన ఆయన సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం చెక్కులు అందజేశారు. హైదరాబాద్, చేవెళ్ల ఎంపీలు అసద్దుదీన్‌ ఒవైసీ, డాక్టర్‌ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్, రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ సంఘటన జరిగిన తీరును మంత్రికి వివరించారు. ఆయన వెంట మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, మేయ ర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులున్నారు. 

అరెస్టులు.. ఆగ్రహాలు 
కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో గగన్‌పహాడ్, మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతాల కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆర్‌జీఐ పీఎస్‌కు తరలించారు. కేటీఆర్‌ పర్యటన ముగిశాక వదిలేశారు.  గగన్‌పహాడ్, పల్లెచెరువు ప్రాంతాలకు చెందిన బాధితులు కేటీఆర్‌తో మొరపెట్టుకునేందుకు ఉదయం నుంచే వేచి ఉన్నారు. కానీ, కేటీఆర్‌ ఆలీనగర్, గగన్‌పహాడ్‌ పర్యటన తర్వాత శంషాబాద్‌ వెళ్లిపోయారు. దీంతో అక్కడ వేచి ఉన్న∙వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.

కష్టనష్టాలపై ఆరా
భారీ వర్షాలకు అతలాకుతలమైన ఫీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను మంత్రి కేటీఆర్‌ సందర్శించారు. బాగా దెబ్బతిన్న ప్రగతినగర్‌ కాలనీలో ఇంటింటికీ తిరుగుతూ యోగక్షేమాలు, వరదల వల్ల జరిగిన నష్టాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు వేళకు ఆహారాన్ని అందించి, అండగా నిలిచిన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కో ఆప్షన్‌ సభ్యులను కేటీఆర్‌ అభినందించా రు. ఆయన వెంట మంత్రి చామకూర మల్లారెడ్డి తదితరులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు