KTR: అనూషను ఆదుకున్న కేటీఆర్‌.. ‘డాక్టర్‌గా తిరిగి రా’..!

6 Oct, 2021 15:14 IST|Sakshi
మెడికల్‌ విద్యార్థి అనూషకు సాయం చేస్తున్న మంత్రి కేటీఆర్‌ (ఫోటోలో అనూష కుటుంబ సభ్యులు)

పేద గిరిజన వైద్య విద్యార్థి ఎంబీబీఎస్ చదువుకి కేటీఆర్ సహకారం 

కరోనా పరిస్థితుల్లో తల్లితో కలిసి కూరగాయలు అమ్ముతున్న అనూష

కిర్గిజీస్తాన్‌లో ఎంబీబీఎస్‌ కోర్సు తొలి 3 ఏళ్లలో 95 శాతంకు పైగా మార్కులు

అనూష వైద్యవిద్యకు ఆర్థిక సాయం అందించిన కేటీఆర్

సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్‌ నగరం బోరబండ ప్రాంతానికి చెందిన తిరుపతి అనూష కిర్గిజీస్తాన్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతుంది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆమె భారతదేశానికి తిరిగి వచ్చింది. ప్రస్తుతం తాను చదువుతున్న వైద్య విద్య కోర్సులో మొదటి మూడు సంవత్సరాల్లో 95 శాతం మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. అయితే కరోనా నేపధ్యంలో చదువును కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో తన తల్లితో కలిసి కూరగాయలు అమ్మడం ప్రారంభించింది.
(చదవండి: వైద్య విద్యార్థిని అవస్థలు .. శ్మశానంలో ‘డాక్టర్‌’ చదువు)

పేద గిరిజన కుటుంబానికి చెందిన అనూష తండ్రి వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. అనూష వైద్య విద్య కోర్సు ఫీజుల కోసం ఇబ్బందులు పడుతున్న విషయం మంత్రి కేటీఆర్‌ దృష్టికి వచ్చింది. పేదరిక పరిస్థితుల నేపథ్యంలోనూ ఎంతో ఛాలెంజింగ్గా, వైద్య విద్యపై మక్కువతో విదేశాలకు వెళ్లి చదువుకునే ప్రయత్నం చేస్తున్న అనూషకి కేటీఆర్ అండగా నిలిచేందుకు నిర్ణయం తీసుకొన్నారు. ఆమె వైద్య విద్యను కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం చేస్తానని బుధవారం కేటీఆర్‌ ప్రకటించారు. 
(చదవండి: కేటీఆర్‌ వాహనానికి చలాన్‌.. ట్రాఫిక్‌ ఎస్‌ఐని అభినందించిన మంత్రి)

అనూష ఎంబీబీఎస్ ఫీజుల బాధ్యత తీసుకుంటానని.. కోర్సు పూర్తి చేసుకొని డాక్టర్‌గా తిరిగి రావాలని కేటీఆర్‌ కోరుకున్నారు.. ఈ సందర్భంగా అనూషకి ఆల్ ద బెస్ట్ చెప్పిన మంత్రి, ఆమెకు అన్నివిధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనూష వైద్య విద్యకు అండగా నిలిచిన మంత్రి కేటీఆర్‌కి ఆమె కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.

చదవండి: కేటీఆర్‌ మెచ్చిన ‘పేపర్‌ బాయ్‌’ వెనుక ఆ తల్లి ఉద్దేశం తెలుసా?

మరిన్ని వార్తలు