మళ్లీ వచ్చేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే 

7 Dec, 2022 02:02 IST|Sakshi
ఎల్బీనగర్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న మంత్రి కేటీఆర్‌ 

మంత్రి కేటీఆర్‌ ధీమా

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయ్‌ 

ఎన్నికల తర్వాత హయత్‌నగర్‌ వరకు మెట్రో విస్తరణ 

ఎల్‌బీనగర్‌ పరిధిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం 

నాగోలు (హైదరాబాద్‌): అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి సారించి వివిధ కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నందున వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్‌ఎస్‌నే గెలిపిస్తారని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లుగా అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల మాదిరిగా సాగుతున్నాయన్నాయని తెలిపారు. మంగళవారం ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో సుమారు రూ.55 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఫతుల్లగూడలో జరిగిన సభలో మాట్లాడారు. 

పేదల్ని ఆదుకుంటున్న పథకాలు 
పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలని, సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో సంతృప్తికర స్థాయిలో ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేశామని కేటీఆర్‌ చెప్పారు. కల్యాణలక్ష్మి, ఆసరా పథకం, కేసీఆర్‌ కిట్‌ వంటి వంద రకాల సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది పేదలను ఆదుకుంటున్నాయని తెలిపారు. మెట్రో రైలు మొదటి దశలో నాగోలు వరకు నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగిందని, నాగోలు నుంచి ఎల్‌బీ నగర్‌ వరకు మిగిలిపోయిన 5 కిలోమీటర్ల మెట్రోను రెండో దశలో చేపడతామని తెలిపారు. వచ్చే ఎన్నికల తర్వాత ఎల్‌బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు మెట్రోను విస్తరిస్తామన్నారు.  

పెరిగిన తలసరి ఆదాయం.. 
తెలంగాణ వచ్చిన సమయంలో రాష్ట్ర తలసరి ఆదాయం 1.24 లక్షలని, తెలంగాణ వచ్చిన ఏడేళ్లలో 2.78 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందని కేటీఆర్‌ తెలిపారు. జీఎస్‌డీపీ తెలంగాణ వచ్చిన సమయంలో 5.6 లక్షల కోట్లని, అదే ఈ రోజు 11.55 లక్షల కోట్లుగా ఉందన్నారు. దేశంలో అత్యుత్తమ 20 గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయని సర్వే చేస్తే..19 గ్రామాలు తెలంగాణలో ఉన్నాయని స్వయంగా కేంద్రమే చెబుతోందని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2022లో రాష్ట్రానికి అత్యధికంగా 26 అవార్డులు కేంద్రం ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు.  

31.7 శాతానికి పెరిగిన గ్రీన్‌ కవర్‌.. 
రాజకీయ నాయకులు ఎన్నడూ చెట్లు, మొక్కలు, పర్యావరణం గురించి మాట్లాడరని కేటీఆర్‌ అన్నారు. చెట్లకు ఓట్లు ఉండవని, వాటితో ఎక్కువ లాభం ఉండదు కాబట్టే మాట్లాడరన్నారు. కానీ కేసీఆర్‌ నాయకత్వంలో 240 కోట్ల మొక్కలు నాటి సంరక్షిస్తుండడంతో గతంలో 24 శాతం ఉన్న గ్రీన్‌ కవర్‌ ఇవాళ 31.7 శాతానికి చేరిందని, ఇది రాష్ట్రానికే గర్వకారణమని పేర్కొన్నారు.

గతంలో ఫతుల్లగూడ ఏరియా అడుగుపెట్ట వీల్లేకుండా దుర్వాసనతో అటవీ ప్రాంతంలా ఉండేదని, ప్రస్తుతం డంప్‌యార్డ్‌ను అపురూపమైన పార్క్‌గా తీర్చిదిద్దామని, దేశంలోని ఎక్కడా లేని విధంగా ముక్తిఘాట్‌ను ఏర్పాటు చేసి రూ.16 కోట్లతో అన్ని కులాలకు, మతాలకు చెందిన వారు ఒకే చోట దహన సంస్కారాలను చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మంత్రి మల్లారెడ్డి, ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు