పారిశుద్ధ్య కార్మికులకు కేటీఆర్‌ పలకరింపు

20 Apr, 2022 08:27 IST|Sakshi

మురుగు నుంచి శాశ్వత విముక్తి 

4 నియోజకవర్గాల్లో తీరనున్న మురుగు అవస్థలు

ఆధునికీకరణ పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన

దాదాపు రూ.297 కోట్ల వ్యయంతో జలమండలి ప్రాజెక్టు 

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని పలు నియోజకవర్గాల్లో మరో రెండేళ్లలో మురుగు అవస్థలు తీరనున్నాయి. మూసీకి ఉత్తరం వైపున మురుగునీటి పారుదల వ్యవస్థ ఆధునికీకరణ పనులకు మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ మంగళవారం శంకుస్థాపన చేశారు. జలమండలి పరిధిలో జోన్‌– 3 సీవర్‌ నెట్‌వర్క్‌ ప్రాజెక్టు పూర్తితో నాలుగు నియోజకవర్గాల పరిధిలో 33.50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి మురుగు తిప్పలు తప్పనున్నాయి. సుమారు రూ.297 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో మొత్తం 129.32 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్‌ నిర్మాణాన్ని జలమండలి చేపడుతోంది. పాతనగరంలో ఉన్న గోషామహల్, నాంపల్లి, కార్వాన్‌తో పాటు జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీవరేజీ వ్యవస్థను ఆధునికీకరించడానికి ఈ ప్రాజెక్టును జలమండలి చేపట్టింది. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను షా కన్సల్టెన్సీ (ముంబై) రూపొందించింది.


 
ప్రాజెక్టు స్వరూపం ఇదీ.. 
► జోన్‌–  3 మురుగు నీటిపారుదల వ్యవస్థలో తొమ్మిది పరీవాహక ప్రాంతాలు ఉంటాయి. మొత్తం 33.50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఎన్‌ 1 నుంచి ఎన్‌ 7 వరకు, ఎన్‌ 11, ఎన్‌ 31 పరీవాహక ప్రాంతాలు ఈ జోన్‌ పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 355.78 కిలోమీటర్ల పొడవైన సీవరేజ్‌ నెట్‌వర్క్‌ ఉంది. 
►ప్రాజెక్టు అంచనా వ్యయం: రూ.297 కోట్లు. 
►నెట్‌వర్క్‌ మొత్తం పొడవు: 129.32 కి.మీ. 
►  ఆర్‌సీసీ ట్రంక్‌ సీవర్స్‌ పైప్‌లైన్లు: 400–1200 ఎంఎం డయా: 36.14 కి.మీ. 
►ఎస్‌డబ్ల్యూజీ నెట్‌వర్క్‌ 200–300ఎంఎం డయా: 93.18 కి.మీ. 
►మురుగు ప్రవాహం అంచనా: 2036 నాటికి: 127.42 ఎంఎల్‌డీ. 
► 2051 నాటికి : 153.81 ఎంఎల్‌డీ. 

ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే ప్రాంతాలు 
టోలిచౌకి, గోల్కొండ, లంగర్‌హౌజ్, సెవెన్‌ టూంబ్స్, జూబ్లీహిల్స్‌ (కొంత భాగం), మెహిదీపట్నం, నానల్‌నగర్, ఆసిఫ్‌ నగర్, విజయ్‌నగర్‌ కాలనీ, ఎన్‌ఎండీసీ కాలనీ, మాసబ్‌ ట్యాంక్, రెడ్‌ హిల్స్, లక్డీకాపూల్, బజార్‌ఘాట్, నాంపల్లి, మల్లేపల్లి, బేగంబజార్‌.  

ప్రయోజనాలు: 
సీవరేజీ వ్యవస్థ పరిధి పెరుగుతుంది. ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతాల నుంచి 100 శాతం మురుగునీటి సేకరణ జరుగుతుంది. నాలాల్లోకి, మూసీ నదిలోకి నేరుగా మురుగునీటి ప్రవాహం ఉండదు. మెరుగైన, ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. 

సివరేజ్‌ పనులను ప్రారంభిస్తున్న మంత్రులు కేటీఆర్, మహమూద్‌ అలీ, ఎంపీ అసదుద్దీన్‌ 

మేం జీతాలు పెంచాం.. మోదీ ధరలు పెంచారు 
బహదూర్‌పురా: పాతబస్తీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ మీరాలం ట్యాంక్‌ వద్ద జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులను పలకరించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తేవాలని సూచించారు. దీంతో వారు తమ జీతాలు పెంచాల్సిందిగా ఆయనను కోరారు. స్పందించిన కేటీఆర్‌.. రాష్ట్రం వచ్చేనాటికి రూ.8 వేలున్న పారిశుద్ధ్య  కార్మికుల వేతనాల్ని సీఎం కేసీఆర్‌  దఫదఫాలుగా  రూ.17 వేలకు  పెంచారన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ ధరలు పెరిగాయని వారు చెప్పగా, అందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే కారణమన్నారు. మేం  జీతాలు పెంచుతూ ఉంటే.. మోదీ ప్రభుత్వం ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

సివరేజీ పనులకు శ్రీకారం 
గోల్కొండ: హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం కార్వాన్‌ నియోజకవర్గం టోలిచౌకిలో రూ. 297 కోట్లతో చేపట్టిన సివరేజీ ప్రాజెక్టు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సివరేజ్‌ లైన్‌ పనులు పూర్తయితే ఎన్నో బస్తీలకు వరద ముంపు తప్పుతుందన్నారు. షేక్‌పేట్‌లో రూ. 333 కోట్లతో అత్యంత పొడవైన ఫ్లై ఓవర్‌ను నిర్మించినట్లు చెప్పారు. సెవన్‌ టూంబ్స్‌ చౌరస్తా నుంచి గోల్కొండ వరకు రోప్‌వే కోసం ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు.  

మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలో తాము ప్రతిపాదించిన పనులకు మంత్రి కేటీఆర్‌ వెంటనే స్పందించి నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొ న్నారు. కార్యక్రమంలో హోంమంత్రి మహ్మద్‌ మహమూద్‌ అలీ, కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మొహియుద్దీన్, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌ మేరాజ్, టీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ ఎంఎన్‌ ప్రభాకర్, కార్పొరేటర్లు మహ్మద్‌ నసీరుద్దీన్, రాషెఫ్‌ ఫరాజుద్దీన్, టీఆర్‌ఎశ్‌ కార్వాన్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి టి.జీవన్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు