హస్త కళాకృతులకు ఇక ప్రపంచ స్థాయి మార్కెటింగ్‌ ..

2 Apr, 2021 02:03 IST|Sakshi

నూతన పోర్టల్‌ ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

ప్రైవేటు ఈ–కామర్స్‌ వెబ్‌సైట్లతో పోలిస్తే మెరుగైన ఫీచర్లు

హైదరాబాద్‌: రాష్ట్రంలో తయారవుతున్న సంప్రదాయ హస్త కళాకృతులకు ప్రపంచస్థాయి మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించేందుకు ‘ఈ–గోల్కొండ’ వెబ్‌ పోర్టల్‌ను రూపొందించినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొ న్నారు. తెలంగాణ చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ ప్లాట్‌ఫాం ద్వారా సంప్రదాయ హస్త కళా కృతులను కొనుగోలు చేసే వీలుంటుందన్నారు. గురువారం ప్రగతిభవన్‌లో జరిగిన కార్య క్రమంలో ‘ఈ– గోల్కొండ’ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంను కేటీఆర్‌ ఆవిష్కరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రైవేటు ఈ–కామర్స్‌ వెబ్‌సైట్లతో పోలిస్తే ‘ఈ–గోల్కొండ’పోర్టల్‌ను మెరుగైన ఫీచర్స్‌తో రూపొందించినట్లు తెలిపారు. ఈ పోర్టల్‌ ద్వారా ప్రస్తుతం దేశంలోని ఏ ప్రాంతానికైనా తమ కళా కృతులను సరఫరా చేయనున్నట్లు చెప్పారు.

త్వరలో కేంద్ర ప్రభుత్వ అనుమతులు పొంది.. ప్రపంచ దేశాలకు కూడా ఎగుమతులు చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ‘ఈ– గోల్కొండ’ద్వారా అమ్మకానికి పెట్టిన కళాకృతులను పరిశీలించేందుకు త్రీడీ చిత్రాలు అందు బాటులో ఉంటాయని తెలిపారు. మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులకు కూడా సౌకర్యవంతంగా ఉండేలా వెబ్‌సైట్‌ రూపొందించామన్నారు. https://golkondashop.telangana.gov.in లింకు ద్వారా తమకు నచ్చిన కళాకృతులను ప్రజలు కొనుగోలు చేయొచ్చని సూచించారు. రాష్ట్రంలో శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న చేనేత కళాకృతుల తయారీని ప్రోత్సహించేందుకు నైపుణ్య శిక్షణ, సాంకేతిక సహకారం, మార్కెటింగ్‌ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ ఏర్పాటు ద్వారా హస్త కళాకృతులు తయారుచేసే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. ప్రగతిభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద్‌గౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, రాష్ట్ర హ్యాండీక్రాఫ్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బొల్లం సంపత్‌కుమార్, చేనేత శాఖ కార్యదర్శి శైలజ రామయ్య పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు