తెలంగాణ భవన్‌లో ‘టెక్‌ సెల్‌’

29 Oct, 2020 08:05 IST|Sakshi
టీఆర్‌ఎస్‌ టెక్‌ సెల్‌ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న కేటీఆర్‌ 

పార్టీ సాంకేతిక విభాగం కార్యాలయాన్ని ప్రారంభించిన కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ను సంస్థాగతంగా బలోపేతం చేయడంలో ‘టెక్‌ సెల్‌’ఉపయోగ పడుతుందని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు అన్నారు. తెలంగాణ భవన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన టెక్‌ సెల్‌ కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. టెక్‌ సెల్‌ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కొత్త కార్యాలయం ఉపయోగ పడుతుందన్నారు. సోషల్‌ మీడియాలో ఏ పార్టీకి లేనంత మంది స్వచ్ఛంద సైనికులు టీఆర్‌ఎస్‌ కు ఉన్నారని, ఉద్యమ సమయం నుంచి వీరు కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని కేటీఆర్‌ వెల్లడించారు. ఆరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తూ, విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టడంలో వీరు పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని అన్నారు. పార్టీ సోషల్‌ మీడియా కన్వీనర్లు రాబోయే రోజుల్లో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుని ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలన్నారు. ఈ సందర్భంగా టెక్‌ సెల్‌ ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాలపై సోషల్‌ మీడియా కన్వీనర్లకు కేటీఆర్‌ పలు సూచనలు చేశారు.

సోషల్‌ మీడియా కన్వీనర్ల నియామకం
టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్లుగా కేటీఆర్‌ నలుగురి పేర్లను ప్రకటించారు. ఇకపై మన్నె క్రిషాంక్, సతీష్‌ రెడ్డి, జగన్‌ పాటిమీది, దినేశ్‌ చౌదరి పార్టీ సోషల్‌ మీడియా కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. పార్టీ సభ్యత్వం, కమిటీల డేటా బేస్, ఇతర సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్లు, పార్టీ వెబ్‌ సైట్, సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫార మ్స్‌ నిర్వహణ టెక్‌ సెల్‌ ఆధ్వర్యంలో జరుగుతోంది. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, నవీన్‌ రావు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు