ప్రణాళికల రూపకల్పనపై  దృష్టి సారించండి

23 Jul, 2021 01:37 IST|Sakshi

డీటీసీపీ, హెచ్‌ఎండీఏలకు మంత్రి కేటీఆర్‌ ఆదేశం

నియంత్రణ చర్యలు, అనుమతులు కలెక్టర్లు చూసుకుంటారు

సాక్షి, హైదరాబాద్‌: ప్రణాళిక సంచాలకులు (డీటీసీపీ), హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)లు.. ఇకపై భవన నిర్మాణ అనుమతులు, వాటి అమలు వంటి నియంత్రణ అంశాలపై కాకుండా ప్రణాళికల రూపకల్పన, వాటి అమలుపై దృష్టి పెట్టాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు ఆదేశించారు. అన్ని నగరాభివృద్ధి సంస్థలు, మునిసిపాలిటీలు, మండల కేం ద్రాలకు సంబంధించిన మాస్టర్‌ ప్లాన్‌లను రూపొందించాలని సూచించారు. నియంత్రణ చర్యలు, అనుమతుల బాధ్యతను జిల్లా కలెక్టర్లు చూసుకుంటారని స్పష్టం చేశారు. మంత్రి ఆదేశాలను మెమో రూపంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ గురువారం జారీ చేశారు.

డిజిటల్‌ నంబరింగ్‌కు ప్రణాళిక సిద్ధం చేయాలి
పట్టణాలు, నగరాల్లోని ఇళ్లకు డిజిటల్‌ నంబరింగ్‌ విధానాన్ని అమలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేయా లని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. జీఐఎస్‌ బేస్‌ మ్యాప్‌ను రూపొందించి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలన్నారు. అన్ని మండల కేంద్రాలు, గ్రామీణ స్థానిక సంస్థలకు భూ వినియోగ ప్రణాళికలు రూ పొందించాలని సూచించారు. హెచ్‌ఎండీఏ అవతల ఉండే పట్టణాలు, నగర పాలక సంస్థల పరిధిలో ల్యాండ్‌ పూలింగ్‌ పథకాన్ని రూపొందించడంలో సాంకేతిక సాధికార సంస్థగా ఉండాలని తెలిపారు. టీఎస్‌ బి పాస్‌కు సంబంధించి జిల్లా కలెక్టర్లకు అవసరమైన సలహాలు ఇవ్వాలని, సాంకేతిక అంశాల పై మార్గనిర్దేశనం చేయాలని మంత్రి ఆదేశించారు.

మరిన్ని వార్తలు