ముంపు ప్రాంతాల్లో కొత్త నిర్మాణాలు బంద్‌!

5 Aug, 2022 01:52 IST|Sakshi

అనుమతులు ఇవ్వరాదని మున్సిపల్‌ శాఖ నిర్ణయం? 

అధికారులకు మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో వరద ముంపునకు గురైన వెంచర్లు, ఖాళీ స్థలాల్లో భవిష్యత్తులో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని మున్సిపల్‌ శాఖ నిర్ణయించినట్లు తెలిసింది. పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు ఈ మేరకు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

గత నెలలో కురిసిన భారీ వర్షాలకు రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఉన్న మున్సిపాలిటీల శివార్లలోని అనేక నివాసాలు నీటమునిగాయి. హెచ్‌ఎండీఏ, డీటీసీపీ  లేఅవుట్లలోని నిర్మాణాలకు, ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా క్రమబద్ధీకరించుకున్న ప్లాట్లలో అనుమతుల విషయంలో ఎలాంటి నిబంధనలను అమలు చేయాలనే విషయమై పురపాలక శాఖ కసరత్తు చేస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. 

చెరువులు, కుంటల్లోనే పట్టణాలు! 
గతనెలలో భారీవర్షాల వల్ల పట్టణాల్లో ని ఏయేప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయనే విషయమై పురపాలక శాఖ నివేదిక రూపొందించినట్లు తెలియవచ్చింది. అందుకు గల కారణాలను కూడా పేర్కొన్నట్లు సమాచారం. జీహెచ్‌ఎంసీ శివార్లలో మొన్నటివరకు గ్రామ పంచాయతీలుగా ఉన్న ప్రాంతాలన్నీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలుగా మారాయి.

చెరువులు, కుంటలుగా ఉన్న ప్రాంతాలు పూడుకుపోయిన చోట్ల, శిఖం భూములుగా ఉన్న ప్రాంతాల్లోనే పట్టణాలు విస్తరించినట్లు  అధికారులు నివేదికలు ఇచ్చినట్లు తెలిసింది. ఆయా ప్రాంతాలకు ఆనుకొని కొత్తగా ఏర్పాటైన వెంచర్లు కూడా ముంపు ప్రాంతాలుగా నే ఉన్నట్లు పురపాలక శాఖ నిర్ణయానికి వచ్చింది.   

మరిన్ని వార్తలు