చెరువులను పరిరక్షించండి 

20 Feb, 2022 03:20 IST|Sakshi
అధికారులతో సమీక్ష జరుపుతున్న కేటీఆర్‌ 

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌

హెచ్‌ఎండీఏ ప్రాజెక్టులపై సమీక్ష 

సాక్షి, సిటీబ్యూరో: హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువుల అభివృద్ధి, పరిరక్షణకు, చెరువుల సుందరీకరణకు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలు చేపట్టాలని అధికారులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. హెచ్‌ఎండీఏ కార్యకలాపాలు, చేపట్టిన ప్రాజెక్టులపై శనివారం నానక్‌రామ్‌ గూడలోని హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎండీఏ పరిధిలో చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టులు, భవిష్యత్‌ ప్రణాళికలకు సంబంధించిన అంశాలపై అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

చెరువుల సంరక్షణపై ప్రత్యేకంగా చర్చించారు. నిపుణులతో  వీడియో కాన్ఫరెన్స్‌ సైతం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చెరువుల సంరక్షణకు  భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక ప్రణాళికలు  రూపొందించాలని కేటీఆర్‌ సూచించారు. హెచ్‌ఎండీఏతో పాటు జీహెచ్‌ఎంసీ కూడా  అనేక చెరువులను అభివృద్ధి చేస్తోందని, ఈ మేరకు రెండు సంస్థలు సమన్వయంతో ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. గండిపేట సుందరీకరణను మరింత వేగంగా విస్తృతస్థాయిలో చేపట్టాల్సిన అవసరం ఉందని, ఇది అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా మారుతుందన్నారు.   

భూముల భద్రతపై దిశానిర్దేశం..  
మరోవైపు హెచ్‌ఎండీఏ అదీనంలోని ప్రభుత్వ భూములను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. రేడియల్‌ రోడ్లు, మూసీ ప్రక్షాళన, మూసీపై బ్రిడ్జీల నిర్మాణం, హెచ్‌ఎండీఏ ల్యాండ్‌ పూలింగ్‌ ప్రణాళికలు, లాజిస్టిక్‌ పార్కుల నిర్మాణం, రానున్న స్వల్ప , దీర్ఘకాలిక భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన  ప్రణాళికలపై అధికారులకు  కేటీఆర్‌  దిశానిర్దేశం చేశారు.  

మరిన్ని వార్తలు