25న టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీ

13 Oct, 2021 12:38 IST|Sakshi

అదే రోజు టీఆర్‌ఎస్‌ అధ్యక్ష ఎన్నిక

17 నుంచి నామినేషన్ల స్వీకరణ: కేటీఆర్‌

నవంబర్‌ 15న వరంగల్‌లో ‘తెలంగాణ విజయ గర్జన’ సభ  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) అధ్యక్షుడి ఎన్నికను ఈ నెల 25న హైదరాబాద్‌లో జరిగే పార్టీ ప్లీనరీ సమావేశంలో నిర్వహించనున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామారావు వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఈ నెల 17న మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో లెజిస్లేచర్, పార్లమెంటరీ సంయుక్త సమావేశం నిర్వహిస్తామన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ 20 ఏళ్ల ప్రస్థానంలో పార్టీ సాధించిన విజయాలను చాటేందుకు నవంబర్‌ 15న వరంగల్‌లో ‘తెలంగాణ విజయ గర్జన’పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు.

‘టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం దినోత్సవం ఏటా ఏప్రిల్‌ 27న నిర్వహించడం ఆనవాయితీ కాగా, రెండేళ్లకోసారి అదే రోజు పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే 2019లో సార్వత్రిక ఎన్నికలు, 2020, 2021 ఏప్రిల్‌లో కరోనా మూలంగా ఆవిర్భావ వేడుకలు, అధ్యక్ష ఎన్నిక జరగలేదు. ఈ ఏడాది సెపె్టంబర్‌ 2న పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియ ప్రారంభమవగా ఇప్పటికే పార్టీ సంస్థాగత కమిటీలకు సంబంధించి గ్రామస్థాయి మొదలుకొని మున్సిపల్‌ వార్డులు, డివిజన్లు, పట్టణ కమిటీల వివరాలు పార్టీ కార్యాలయానికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 25న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక నిర్వహిస్తాం’అని కేటీఆర్‌ ప్రకటించారు. 

హెచ్‌ఐసీసీలో 14 వేల మందితో ప్లీనరీ... 
‘పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కోసం ఈ నెల 17 నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రారంభించి 22 వరకు నామినేషన్లు తీసుకుంటారు. 23న నామినేషన్ల పరిశీలన, 24న ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ)లో జరిగే ఈ నెల 25న జరిగే ప్లీనరీకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 వేల మంది పార్టీ ప్రతినిధులు హాజరవుతారు. ఈ సమావేశం ప్రారంభంలోనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొని, ఆయన ఆధ్వర్యంలోనే ప్లీనరీ జరుగుతుంది. అసెంబ్లీ మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి అధ్యక్షతన ఏర్పాటయ్యే తీర్మానాల కమిటీ... ప్లీనరీలో చేయాల్సిన తీర్మానాలపై చర్చించి ఏయే తీర్మానాలు చేపట్టాలో ఖరారు చేస్తుంది’అని కేటీఆర్‌ వివరించారు.

వరంగల్‌లో ‘తెలంగాణ విజయ గర్జన’ 
ఉద్యమ పార్టీగా 14 ఏళ్లు, అధికార పార్టీగా ఏడేళ్లుగా టీఆర్‌ఎస్‌ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు వచ్చే నెల 15న వరంగల్‌లో ‘తెలంగాణ విజయగర్జన’చేపడుతున్నాం. అధికారం చేపట్టిన ఏడేళ్లలోనే ప్రగతిశీల రాష్ట్రంగా దేశంపై తెలంగాణ ముద్ర వేసింది. టీఆర్‌ఎస్‌ ద్విదశాబ్ది ప్రస్థానాన్ని ఘనంగా జరుపుకొనేందుకు నిర్వహిస్తున్న ఈ గర్జనకు టీఆర్‌ఎస్‌ యంత్రాంగం, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాల్సిందిగా కోరుతున్నాం. విజయగర్జన తర్వాత హైదరాబాద్, వరంగల్‌ మినహా మిగతా జిల్లాల్లో ఇప్పటికే పూర్తయిన పార్టీ జిల్లా కార్యాలయాలను ప్రారంభిస్తాం’అని కేటీఆర్‌ వెల్లడించారు. కాగా, హుజూరాబాద్‌ ఉప ఎన్నికను అంత తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదని, ప్రచారానికి సంబంధించి సీఎం కేసీఆర్‌ షెడ్యూల్‌ ఖరారు కావాల్సి ఉందని కేటీఆర్‌ పేర్కొన్నారు.   

చదవండి: నీట్‌ రద్దు: మంత్రి కేటీఆర్‌తో డీఎంకే ఎంపీల భేటీ 
 చారిత్రక వేదిక.. సరదాల వేడుక: అసదుద్దీన్‌కు కేటీఆర్‌ సూచన

మరిన్ని వార్తలు