ఐటీఐఆర్‌.. లేదంటే అదనపు ప్రోత్సాహకం

9 Sep, 2021 04:04 IST|Sakshi

కొత్త రాష్ట్రాలకు కేంద్ర ఐటీ శాఖ మరింత సాయం ఇవ్వాలి 

విధాన నిర్ణయాలతో తెలంగాణలో ఐటీ అభివృద్ధి 

ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీతో మంత్రి కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ లాంటి కొత్త రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) మంత్రిత్వ శాఖ మరింత సాయం అందించాలని  ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు కోరారు. ఐటీఐఆర్‌ వంటి సమాంతర ప్రాజెక్టు లేదా అదనపు ప్రోత్సాహకాన్ని వెంటనే ప్రకటించే అంశంలో తమకు సహకరించాలన్నారు. రాష్ట్రంలో రెండురోజులుగా పర్యటిస్తున్న పార్లమెంటు సభ్యుడు శశిథరూర్‌ నేతృత్వంలోని ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీతో కేటీఆర్‌ బుధవారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు.

రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను  కమిటీకి మంత్రి వివరించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూ త్న కార్యక్రమాలు కొనసాగితే హైదరాబాద్‌ అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని పార్లమెంటరీ కమిటీ ప్రశంసించింది. తెలంగాణలో అమలవుతున్న విధానాలను ఆయా రాష్ట్రాలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమలు చేసే అంశంపై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తామని కమిటీ ప్రకటించింది.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్‌ గవర్నెన్స్‌ సేవలు, ఇన్నోవేషన్‌ రంగంలో ఇంక్యుబేటర్ల ఏర్పాటు, టీ ఫైబర్‌ ప్రాజెక్టులను కమిటీ ప్రశంసించింది. ఐటీ రంగం అభివృద్ధితో పాటు ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరవేయడంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు దేశానికి ఉపయుక్తంగా ఉంటాయని కమిటీ పేర్కొంది.  

విధానపర నిర్ణయాల వల్లే పెట్టుబడులు: కేటీఆర్‌ 
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టీఎస్‌ఐపాస్‌తో పాటు ఐటీ పరిశ్రమ అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాల ద్వారా తెలంగాణకు పెట్టుబడులు వచ్చా యని కేటీఆర్‌ పార్లమెంటరీ కమిటీకి వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్‌ కంపెనీలు హైదరాబాద్‌లో తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేశాయన్నారు. ఐటీ రంగం అభివృద్ధి ద్వారా ఉద్యోగ కల్పనతో పాటు ఐటీ ఎగుమతులు కూడా భారీగా పెరిగాయన్నారు. ఆవిష్కరణల వాతావరణం ప్రోత్సహించేందుకు టీ హబ్, వీ హబ్, అగ్రి హబ్, బీ హబ్, రిచ్, టీ వర్క్స్‌ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు కేటీఆర్‌ వివరించారు.

మీ సేవ ద్వారా ప్రభుత్వ సేవలు, టి వాలెట్‌ ద్వారా సాధించిన మైలు రాళ్లను వివరించడంతో పాటు, ఇంటింటికీ ఇంటర్నెట్‌ లక్ష్యంతో చేపట్టిన టీ ఫైబర్‌ ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు ఇవ్వాలని కేటీఆర్‌ కోరారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), డ్రోన్‌ టెక్నాలజీ వినియోగాన్ని వివరిస్తూ సైబర్‌ సెక్యూరిటీ కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తామన్నారు. భూ పరిపాలన కోసం రూపొందించిన ధరణి ప్రత్యేకతలను వివరించారు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌తో పాటు ఐటీ శాఖ ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ శశిథరూర్‌తో పాటు కమిటీ సభ్యులకు మంత్రి కేటీఆర్‌ జ్ఞాపికలను అందజేసి సన్మానించారు.

మరిన్ని వార్తలు