సమస్యలపై కేటీఆర్‌కు ట్వీట్లు.. స్పందించిన మంత్రి 

3 Jun, 2021 13:14 IST|Sakshi
ఉప్పల్‌లో చాయ్‌ బండిని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ అధికారులు

సాక్షి, ఉప్పల్‌: ట్విట్టర్‌ మేసేజ్‌కు స్పందించిన మంత్రి కేటీఆర్‌ పేదోడి కుటుంబానికి తోడుగా నిలిచారు. ఉప్పల్‌కు చెందిన శివారెడ్డి ఎన్నో ఏళ్లుగా చాయ్‌ బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా చాయ్‌ బండిని తొలగించడంతో జీవనోపాధిని కోల్పోయాడు. దీంతో శివారెడ్డి కుటుంబం రోడ్డున పడింది. చేసేది లేక మంత్రి కేటీఆర్‌కు శివారెడ్డి ట్విట్టర్‌ ద్వారా తన బాధను చెప్పుకున్నాడు. దీంతో స్పందించిన మంత్రి టీఆర్‌ఎస్‌ పార్టీ డివిజన్‌ అధ్యక్షుడు బన్నాల ప్రవీణ్‌ ద్వారా బండిని ఏర్పాటు చేయించారు. ఈ చాయ్‌ బండిని బుధవారం ఉప్పల్‌ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి తన చేతుల మీదుగా ప్రారంభించి శివారెడ్డికి కొత్త జీవితాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో చిలుకానగర్‌ కార్పొరేటర్‌ గీత, డీసీ అరుణ కుమారి, ఈఈ నాగేందర్‌ ఉప్పల్‌ పీఎస్‌ ఎస్‌హెచ్‌ఓ ఏసీపీ రంగస్వామి, సీఐ గోవిందరెడ్డి పాల్గొన్నారు. 

చదవండి: ఎక్స్‌ట్రా మసాలా.. లెగ్‌ పీస్‌ లేదు.. స్పందించిన కేటీఆర్‌   

సాక్షి, బంజారాహిల్స్‌: తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలు నేరుగా మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్తున్నారు. సోషల్‌ మీడియా కొత్త పుంతలు తొక్కుతుండగా అదే వేదికగా జనం తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇటీవల కాలంలో మంత్రి కేటీఆర్‌ దృష్టికి నిత్యం 20 నుంచి 25 వరకు తమ సమస్యలు పరిష్కరించాలంటూ జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ జోన్‌ పరిధి నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ట్విట్టర్‌ వేదికగా బాధితులు తమ సమస్యలకు సంబంధించిన ఫొటోలను పంపిస్తున్నారు. మంత్రి స్పందించేదాకా బాధితులు వదలడం లేదు. మంత్రి నుంచి రెస్పాన్స్‌ వచ్చాకనే సంతృప్తి పడుతున్నారు. సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని బస్తీవాసులు ఆగ్రహం మీద ఉన్నారు. వానాకాలం వస్తుందంటేనే వణుకుపడుతుందని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని కాపాడేది మీరేనంటూ మంత్రి కేటీఆర్‌ను వేడుకుంటున్నారు. అధికారులపై తమకు నమ్మకం లేదని కుండబద్దలుకొడుతున్నారు.

తాజాగా బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌–1లోని తాజ్‌బంజారా హోటల్‌ వెనుకాల తాజ్‌బంజారా లేక్‌ పూర్తిగా దుర్గంధమయంగా మారిందని.. ఈ లేక్‌కు దారితీసే సింగాడికుంట నాలా మొత్తం వ్యర్థాలతో నిండిపోయి మురుగు ముందుకు వెళ్లలేని పరిస్థితులు తలెత్తుతున్నాయంటూ స్థానిక యువకుడు మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశాడు. మంగళవారం సదరు యువకుడు ట్వీట్‌ చేసిన ఫొటోల్లో తాజ్‌ బంజారా లేక్, సింగాడికుంట నాలాల్లో దుస్థితిని కళ్లకు కట్టారు. రాబోయే వర్షాకాలంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ దుర్గంధం, దుర్వాసనలతో స్థానికులు దోమల బెడదతో ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారని ఆరోపించారు. తాజ్‌బంజారా లేక్‌లోకి వరదనీరు సాఫీగా వెళ్లకుండా అడుగడుగునా అడ్డంకులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా స్పందించడం లేదంటూ నిలదీశారు. సింగాడికుంట నాలా దుస్థితిపై తన మొదటి ట్వీట్‌ను మార్చి 6వ తేదీన మంత్రి కేటీఆర్‌కు చేశారు.  

స్పందించిన మంత్రి.. 
అప్పటి నుంచి ప్రతిరోజూ ఈ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్తుండగా ఎట్టకేలకు బుధవారం మంత్రి కేటీఆర్‌ స్పందించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఖైరతాబాద్‌ జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ ప్రావీణ్యలకు ఈ సందర్భంగా ఆయన ట్వీట్‌ చేస్తూ ఈ ప్రాంతాన్ని సందర్శించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిందిగా కోరారు.  

చదవండి: కేటీఆర్‌ని సోనూ సూద్‌ ఏమి కోరారో తెలుసా?

మరిన్ని వార్తలు