తెలంగాణ భారత్‌లో భాగం కాదా? కేంద్రంపై కేటీఆర్‌ ఆగ్రహం

6 Mar, 2021 01:21 IST|Sakshi

ఎన్నాళ్లీ వివక్ష? మేం భారత్‌లో భాగం కాదా?.. కేంద్రంపై మండిపాటు

తెలంగాణకు దక్కాల్సిన అంశాల్లో సహాయ నిరాకరణ ఎందుకు?

మా గొంతు విప్పాల్సిన సమయం వచ్చింది

ఏళ్ల తరబడి విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు

ఐటీఐఆర్‌ను అడ్డుకుని రాష్ట్రంలో ఐటీ రంగాన్ని దెబ్బతీస్తోంది

‘మేకిన్‌ ఇండియా’ నినాదమిస్తే సరిపోదు.. చేతల్లో చూపండి

సీఐఐ వార్షిక సదస్సులో కేటీఆర్‌ ప్రసంగం

‘పార్లమెంటు సాక్షిగా విభజన చట్టంలోని హామీలను కేంద్రం తుంగలో తొక్కింది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ ఏర్పాటు వంటి హామీలను గాలికి వదిలేసింది. పారిశ్రామిక అభివృద్ధిలో కీలకమైన రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలనే డిమాండ్‌పై కేంద్రం స్పందించడం లేదు. బుల్లెట్‌ ట్రైన్, హైస్పీడ్‌ నెట్‌వర్క్‌లలోనూ తెలంగాణకు దక్కిందేమీ లేదు.’ - కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘‘తెలంగాణ ఏర్పడిన నాటి నుంచీ కూడా కీలకమైన పారిశ్రామిక రంగంలో, న్యాయంగా దక్కాల్సిన ప్రాజెక్టులు, పథకాలు, ప్రోత్సాహకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతోంది. నవ జాత శిశువు లాంటి తెలంగాణ తన కాళ్ల మీద తాను నిలబడటానికి సాయం అందించాలని ఏళ్లుగా కోరుతున్నా కేంద్రం నుంచి స్పందన రావ డం లేదు. ఇలా వివక్ష చూపితే ఎలా.. మేం భారత్‌లో భాగం కాదా? ఇప్పుడు తెలంగాణ అభి వృద్ధి కోసం, తెలంగాణ ప్రజల కోసం మా గొం తును గట్టిగా విప్పాల్సిన అవసరం, సమయం వచ్చింది..’’ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన వార్షిక సదస్సులో కేటీఆర్‌ ప్రసంగించారు. పారిశ్రామిక రంగంతో పాటు వివిధ రంగాల్లో తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు.

నినాదం ఇస్తేనే సరిపోదు..
కేంద్ర ప్రభుత్వం మేకిన్‌ ఇండియా అని నినాదం ఇస్తే సరిపోదని, చేతల్లో చూపాలని కేటీఆర్‌ అన్నారు. ‘‘ఇలా వివక్ష చూపితే తయారీ రంగంలో చైనాతో భారత్‌ ఎలా పోటీపడగలదు. మేం భారత్‌లో భాగం కాదా? ప్రాజెక్టులు, నిధుల విష యంలో రాజకీయాలను పక్కన పెట్టండి. మేకిన్‌ ఇండియా సాధ్యపడాలంటే రాష్ట్రాలు అడిగిన ప్రాజెక్టులు మంజూరు చేయండి. కేంద్రం మద్దతు ఉంటే మరింత మందికి ఉద్యోగావకాశాలు ఇవ్వ గలం. కేంద్రం రాష్ట్రాలతో కలిసి పనిచేయాల్సిందే’’ అని స్పష్టం చేశారు. సంక్షేమంతోపాటు పారి శ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. టీఎస్‌ఐపాస్‌ వంటి పారిశ్రామిక విధానాన్ని తెచ్చి.. రూ.1.12 లక్షల కోట్ల పెట్టుబడులతో 15 వేల కంపెనీలను రాష్ట్రానికి రప్పించామని, సుమారు 15 లక్షల ఉద్యోగాలు కల్పించామని కేటీఆర్‌ వివరించారు. గత ఆరేండ్లలో వ్యవసాయం మొదలుకుని ఐటీ, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్‌ వంటి కీలక రంగాల్లో రాష్ట్రం ఎంతో ప్రగతి చూపినా కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేదని మండిపడ్డారు. వివిధ వేదికల మీద రాష్ట్రాన్ని ప్రశంసిస్తున్న కేంద్ర మంత్రులు తెలంగాణకు అణా పైసా సాయం చేయడం లేదని విమర్శించారు.

విభజన హామీలు తుంగలో
పార్లమెంటు సాక్షిగా విభజన చట్టంలోని హామీలను కేంద్రం తుంగలో తొక్కిందని కేటీఆర్‌ మండిపడ్డారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు వంటి హామీలను గాలికొదిలేసిందని విమర్శించారు. పారిశ్రామిక అభివృద్ధిలో కీలకమైన రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలనే డిమాండ్‌పై కేంద్రం స్పందించడం లేదని.. బుల్లెట్‌ ట్రైన్, హైస్పీడ్‌ నెట్‌వర్క్‌లలోనూ తెలంగాణకు దక్కిందేమీ లేదని చెప్పారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. రాష్ట్ర ఏర్పాటుకంటే ముందే మంజూరైన ఐటీఐఆర్‌ ప్రాజెక్టును అడ్డుకోవడం ద్వారా తెలంగాణలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు ఎన్డీయే ప్రభుత్వం మోకాలడ్డుతోందని విమర్శించారు.

రాష్ట్ర ఐటీ ఎగుమతులు ఆరేండ్లలో రూ.57 వేల కోట్ల నుంచి రూ.1.40 లక్షల కోట్లకు చేరినా.. కేంద్రం నుంచి ప్రోత్సాహం కరువైందని.. అదనపు ఎలక్ట్రానిక్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్, హైదరాబాద్‌ ఫార్మాసిటీలో మౌలిక వసతులకు రూ.3,900 కోట్లు ఇవ్వాలన్న విజ్ఞప్తులపై మౌనం పాటిస్తోందని తెలిపారు. జీనోమ్‌ వ్యాలీలో వ్యాక్సిన్‌ టెస్టింగ్‌ కేంద్రం ఏర్పాటు, డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ కారిడారు మంజూరు, ఏరోస్పేస్‌ డిఫెన్స్‌ రంగంలో రీసెర్చ్, ఇన్నోవేషన్‌ కోసం డిఫెన్స్‌ ఇంక్యుబేటర్, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్, ఎయిరో ఇంజన్‌ కారిడార్‌ మంజూరు వంటి విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోవడమే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్, సిరిసిల్లలో పవర్‌ లూమ్‌ క్లస్టర్, నేషనల్‌ టెక్స్‌టైల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్, హ్యాండ్లూమ్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఏర్పాటు విషయంలో మొండి చేయి చూపుతున్నారని కేటీఆర్‌ వివరించారు. గతేడాదితో పోలిస్తే ఎగుమతుల్లో 2020–21లో 15.5 శాతం వృద్ధిరేటును నమోదు చేసినా డ్రైపోర్టుపై స్పందన లేదని చెప్పారు.

హైదరాబాద్‌ వెలుపలికి ఐటీని విస్తరిస్తం
హైదరాబాద్‌  వెలుపల ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరిస్తామరని.. నల్గొండ, రామగుండం, సిద్దిపేటలో ఐటీ హబ్స్‌ ఏర్పాటు చేస్తామని కేటీఆర్‌ చెప్పారు. ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించడం ద్వారా కంపెనీలకు వ్యయం తగ్గడంతో పాటు స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ఇప్పటికే కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లో పలు ఐటీ కంపెనీలు అడుగుపెట్టాయని.. వరంగల్‌లో టెక్‌ మహీంద్రా, సైయంట్, మైండ్‌ట్రీతోపాటు పలు స్టార్టప్స్, ఎస్‌ఎంఈలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని వెల్లడించారు. కాగా సీఐఐ వార్షిక సదస్సులో భాగంగా పరిశ్రమలతో పాటు వివిధ కేటగిరీలకు చెందిన సంస్థలకు ఈ సందర్భంగా అవార్డులు అందజేశారు.  

మరిన్ని వార్తలు