పాలన సంస్కరణలతోనే పురోగతి

21 May, 2022 10:05 IST|Sakshi
లండన్‌లోని భారత హైకమిషన్‌ కార్యాలయంలో ప్రసంగిస్తున్న మంత్రి కేటీఆర్‌

భారత్‌ అగ్రశ్రేణి దేశంగా ఎదిగేందుకు అవకాశం 

ప్రముఖ కంపెనీల పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ 

లండన్‌ నెహ్రూ సెంటర్‌లో కేటీఆర్‌ ప్రసంగం 

సాక్షి, హైదరాబాద్‌: విప్లవాత్మకమైన పాలన సంస్కరణల ద్వారానే ప్రపంచ దేశాలతో భారత్‌ పోటీ పడి పురోగతి సాధించగలదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. అత్యధిక సంఖ్యలో యువ జనాభాను కలిగి ఉన్న భారత్‌ అగ్రశ్రేణి దేశంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. యూకే పర్యటనలో భాగంగా శుక్రవారం లండన్‌లోని భారత హైకమిషనర్‌ కార్యాలయం నెహ్రూ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ ప్రసంగించారు.

బ్రిటన్‌కు చెందిన పలువురు కీలక వ్యాపారవేత్తలు, భారతీయ సంతతి ప్రముఖులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా డిప్యూటీ హై కమిషనర్‌ సుజిత్‌ జా య్‌ ఘోష్‌ , నెహ్రూ సెంటర్‌ డైరెక్టర్‌ అమిష్‌ త్రిపా ఠి ఆధ్వర్యంలో జరిగిన చర్చాగోష్టిలో మంత్రి అనే క అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు.  

వేదాంత గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌తో మంత్రి కేటీఆర్‌

దేశానికి రోల్‌ మోడల్‌గా తెలంగాణ 
‘ఒకవైపు పాలనా సంస్కరణలు, పెట్టుబడులకు అనుకూలమైన స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా దేశాన్ని ముందుకు తీసుకుపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇదే స్ఫూర్తి తో తెలంగాణ పురోగమిస్తూ భారతదేశానికి ఒక రోల్‌ మోడల్‌గా నిలుస్తోంది. తెలంగాణ అవతరణ సమయంలో నెలకొని ఉన్న సంక్షోభ పరిస్థితులను అధిగమించి ఈ రోజు ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలకు పెట్టుబడుల గమ్యస్థానంగా రాష్ట్రం మారింది. దీనికి పరిపాలనా సంస్కరణలే ప్రధాన కారణం..’అని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

తెలంగాణ విజయాలు ప్రపంచానికి చాటాలి 
‘ప్రజలకు అవసరమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నాం. ప్రపంచంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును అత్యంత తక్కువ సమయంలో నిర్మించాం. తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలు తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు. వీటిని భారతదేశ విజయాలుగా పరిగణించి ప్రపంచానికి చాటాల్సిన అవసరముంది. వివిధ దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు మాతృదేశం సాధిస్తున్న విజ యాలను ప్రపంచానికి చాటేందుకు కృషి చేయాలి..’అని మంత్రి పిలుపునిచ్చారు. విద్య, ఉపాధి, ఆరి ్థకాభివృద్ధి, దేశంలోని రాజకీయ పరిణామాలు.. తదితర అంశాలపై సమావేశానికి హాజరైనవారు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానాలు ఇచ్చారు. 

వేదాంత గ్రూప్‌ చైర్మన్‌తో భేటీ 
వేదాంత గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ వేద్‌తో కేటీఆర్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలపై చర్చించడంతో పాటు హైదరాబాద్‌కు రావాల్సిందిగా ఆయనకు కేటీఆర్‌ ఆహ్వానం పలికారు.  

మరిన్ని వార్తలు