‘డబుల్‌’ రానివారికి డబ్బులు

6 Mar, 2022 02:47 IST|Sakshi
వెంకటాపూర్‌ సభలో సమ్మెట సునీతను చూపిçస్తూ మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌  

ఇళ్లు కట్టిస్తున్నాం.. పెళ్లికి సాయం చేస్తున్నాం 

ఇన్ని సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవు 

ఇక్కడి పథకాలు మరెక్కడైనా అమలవుతున్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా 

సవాల్‌ విసిరిన మంత్రి కేటీఆర్‌

సిరిసిల్ల: రాష్ట్రంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు రాని అర్హులైన పేదలకు ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని, లబ్ధిదారులు సొంతస్థలంలో ఇల్లు కట్టుకునే వెసులుబాటు కల్పిస్తుందని, జాగాలేనివారికి ప్రభుత్వమే స్థలం కేటాయిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను శనివారం ప్రారంభించారు.

అలాగే, వేములవాడలోని ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌యార్డు పనులకు భూమిపూజ చేశారు. ఆయా కార్యక్రమాల అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలకు పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఖర్చులతోనే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించి ఇస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు.. వచ్చిన తరువాత ఏం జరిగిందో.. ఏం జరుగుతోందో ప్రజలు ఆలోచించాలని కోరారు.

తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? అని ప్రశ్నించారు. పొలిటికల్‌ టూరిస్టులు అబద్ధాలతో అసంబద్ధ విమర్శలు చేస్తున్నారన్నారు. ‘ఇటీవల ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఉన్న పథకాలలో ఒక్కటైనా వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలవుతున్నాయా..? అమలవుతున్నట్టు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా’ అని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. కాశీలో వెయ్యి కోట్లు పెట్టిన మీరు కరీంనగర్‌ ఎంపీగా వేములవాడకు రూ.100 కోట్లు తెచ్చే తెలివి ఉన్నదా..? అని మండిపడ్డారు.  

సంక్షేమానికి సమ్మెట సునీత ఒక నిదర్శనం 
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమానికి వెంకటాపూర్‌కి చెందిన సమ్మెట సునీతనే ఒక నిదర్శనమని కేటీఆర్‌ అన్నారు. ఆమెకు ఆసరా పెన్షన్‌ వస్తోందని, ఇప్పుడు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు వచ్చిందని, కూతురు పెళ్లికి కల్యాణలక్ష్మి కూడా రాబోతోందని కేటీఆర్‌ వివరించారు. సునీతను చూపిస్తూ ఇలాంటి పేద మహిళకు పైసా ఖర్చు లేకుండా ఇన్ని సంక్షేమ పథకాలు ఏనాడైనా ఇదివరకు అందాయా.. అని ప్రశ్నించారు.

కేటీఆర్‌ ఆమెను వేదికపైకి పిలిపించి చెబుతుండగా కన్నీటి పర్యంతమైంది. ఇదే గ్రామానికి చెందిన మేడిశెట్టి రాజు కరెంట్‌షాక్‌తో చనిపోతే, రైతుబీమా రూ.5 లక్షలు, ‘సెస్‌’నుంచి మరో రూ.5 లక్షలు, టీఆర్‌ఎస్‌ పార్టీ పరంగా రూ.2 లక్షలు అందాయని చెప్పారు.  

నాకు 16 ఏళ్ల కిందటే షుగర్‌ వచ్చింది
రాష్ట్రంలోని అన్ని జిల్లాలోనూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి హెల్త్‌ ప్రొఫైల్‌ను సిద్ధం చేస్తామని కేటీఆర్‌ వెల్లడించారు. హెల్త్‌ ప్రొఫైల్‌ కార్యక్రమాన్ని వేములవాడ ఏరియా ఆస్పత్రిలో శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ‘పదహారేళ్ల కిందట హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కోసం పరీక్షలు చేయించుకుంటే నాకు షుగర్‌ ఉందని తేలింది.. అప్పటి నుంచి మితంగా తినడం, జాగ్రత్తగా ఉండటం అలవాటైంది’అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.రానున్న ఆరోగ్య ఇబ్బందులను, రోగాలను ముందే గుర్తించేందుకు, వైద్యరంగంలో అవసరం మేర మౌలిక వసతుల కల్పనకు హెల్త్‌ ప్రొఫైల్స్‌ ఉపయోగపడతాయన్నారు.  

మరిన్ని వార్తలు